గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ర్యాలీ
x

గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ర్యాలీ

మొక్కజొన్న రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ నేతల నిరసన, కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు.


మొక్కజొన్న రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ ఆగ్రహం మరింత ముదిరింది. గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్‌ఎస్ నేతలు భారీ నిరసన చేపట్టడం తాజా పరిణామంగా మారింది. గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ శ్రవణ్ సహా పలువురు నేతలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. మార్కెట్లకు వచ్చిన పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు.

మొక్కజొన్నలతోనే నిరసన చేపట్టిన నేతలు అక్కడి నుంచి కాలినడకన అసెంబ్లీ వైపు ర్యాలీగా బయలుదేరారు. అంతకు ముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో రైతులు పంట మార్పిడి చేసి సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. కానీ పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మొక్కజొన్న మార్కెట్లకు వచ్చి 15 రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర రూ.2400 ఉన్నప్పటికీ రైతులు దళారులకు రూ.1600 నుంచి 1700కే అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు.

ప్రభుత్వం దళారులకు మేలు చేస్తున్నదా, రైతులకు మేలు చేస్తున్నదా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందని తెలిపారు. ఇదిలా ఉంటే, అకాల వర్షాలు మరియు వడగండ్ల వానల వల్ల మొక్కజొన్నతో పాటు మామిడి తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన పంట తడవడంతో రైతులు నష్టపోతున్నారని వివరించారు.

పంటల బీమా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా రైతులకు సబ్సిడీ అందలేదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నష్టం వివరాలు సేకరించి వెంటనే ఎన్యూమరేషన్ చేయాలని సూచించారు. నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని కోరారు.

Read More
Next Story