తెలంగాణ అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నిరసనలు..
x

తెలంగాణ అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నిరసనలు..

బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై నినాదాలతో ఒత్తిడి పెంచారు.


తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజే రాజకీయ వేడి పెరిగింది. సభ ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ సభ్యులు నిరసనలతో రంగంలోకి దిగారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన గులాబీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై నినాదాలతో తీవ్రంగా స్పందించారు. దీంతో మొదటి రోజే అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య కొనసాగనున్న సంకేతాలు కనిపించాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభం కావాల్సి ఉంది. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మొదటి నుంచే వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించారు. దీనికి బదులుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై నినాదాలతో ఒత్తిడి పెంచారు. రైతులకు వెన్నుపోటు పొడిచారని, రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇచ్చారని విమర్శించారు. రాహుల్ బంధు కాదని, రైతుబంధు కావాలని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి మరిచిపోయారని, పేదలపై భారాన్ని మోపారని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టలేదని విమర్శలు వినిపించాయి. మహిళలను నిరాశపరిచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇలా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే ప్రతిపక్షం నిరసనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాబోయే రోజుల్లో సభలో చర్చలు, వాదోపవాదాలు మరింత ఉత్కంఠగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Read More
Next Story