
ఫిరాయింపులపై హైకోర్టుకు బీఆర్ఎస్.. వారికి మినహాయింపు..
స్పీకర్ క్లీన్ చిట్ తర్వాత కూడా ఫిరాయింపుల కేసులో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటీషన్‌లో కొంతమంది నేతలను మినహాయించడం చర్చనీయాంశం.
పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఈ అంశంపై ఇప్పటికే స్పీకర్ మొత్తం పది మందికి క్లీన్ చిట్ ఇచ్చినా.. బీఆర్ఎస్ మాత్రం పట్టువదలడం లేదు. తాజాగా ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. కాగా మొత్తం పది మంది నేతలపై కాకుండా ఏడుగురు నేతలపై మాత్రమే బీఆర్ఎస్ పిటీషన్ దాఖలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అందులో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నుంచి గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కడియం శ్రీహరి పేర్లను బీఆర్ఎస్ మినహాయించడం ప్రస్తుతం కీలకంగా మారింది. అసలు వారి ముగ్గురిని ఎందుకు మినహాయించారు? మొన్నటి వరకు కడియం.. పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయన్న నేతలు ఇప్పుడెందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు? లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కడియం శ్రీహరి పేర్లు పిటిషన్‌లో లేకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలకు దారితీసింది. మొన్నటి వరకు ఈ నేతలపై కూడా ఫిరాయింపు ఆరోపణలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్న విషయం గుర్తుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారిని ఎందుకు మినహాయించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కడియం శ్రీహరి విషయంలో ముందుగా ఆధారాలు ఉన్నాయని చెప్పిన పార్టీ, ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు కనిపించడం చర్చనీయాంశమైంది.
స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్‌ను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిరాయింపులపై స్పష్టత రావాలనే ఉద్దేశంతో ఈ అడుగు వేసినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పిటిషన్‌లో కొంతమందిని మాత్రమే చేర్చడం వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయా అనే చర్చ కూడా సాగుతోంది. లీగల్ స్ట్రాటజీ భాగంగా బలమైన కేసులు ఉన్న వారిపై మాత్రమే ముందుకు వెళ్లాలని నిర్ణయించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంతో ఫిరాయింపుల కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు విచారణలో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో ఆసక్తిగా మారింది.

