బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నదా ?
x
BRS boycotting Assembly session

బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నదా ?

అసెంబ్లీలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదన్న సాకుతో కారుపార్టీ నేతలు సమావేశాలను బహిష్కరించారు


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ముందేమో శుక్రవారం సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత శనివారం కూడా రామని చెప్పారు. తాజాగా మొత్తం సమావేశాలనే బహిష్కరించే ఆలోచనలో ఉన్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నదనే చర్చ పెరిగిపోతోంది. అసెంబ్లీలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదన్న సాకుతో కారుపార్టీ నేతలు సమావేశాలను బహిష్కరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు పెద్దగా మైక్ ఇవ్వటంలేదు. అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ కూడా ఇలాగే చేసింది.

అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఏకంగా సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించటం సబబుకాదనే చర్చ పెరిగిపోతోంది. ఇపుడు తెలంగాణలో కాని సభలోకాని ప్రధానమైన అంశం జల వివాదాలే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూనే రాజకీయమంతా నడుస్తోంది. తెలంగాణకు ద్రోహం చేసింది మీరే అంటే కాదు మీరే అని రేవంత్, మంత్రులు-హరీష్, ఎంఎల్ఏలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. శనివారం సాయంత్రం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగానే పాలమూరు-రంగారెడ్డి అనుమతులు, వాటాలు తదితరాలపై ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజంటేషన్ లో ఏమి చెబుతారో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చూడాల్సింది.

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ వల్ల జరిగిన అన్యాయం, ద్రోహం అని రేవంత్, ఉత్తమ్ పదేపదే ఆరోపిస్తున్నారు. కృష్ణా జలాల వాటాలో 299 టీఎంసీలు చాలని కేసీఆర్ చేసిన సంతకమే ఇపుడు తెలంగాణకు ఉరితాడులాగ బిగుసుకున్నదని రేవంత్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ విషయం నిజమే అని కేంద్రమంత్రి బండి సంజయ్ తో పాటు బీజేపీ ఎంపీలు కూడా చెబుతున్నారు. కేసీఆర్ సంతకంచేసిన ఒప్పందాలను అసెంబ్లీలో మంత్రి ప్రదర్శించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు కాదు తాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని సుప్రింకోర్టులో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ను కూడా చూపించారు. ఇలాంటి అనేక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ఉత్తమ్ ప్రజంటేషన్ ఇచ్చారు.

అందుకనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సమర్ధించుకునేందుకు అవకాశాలు లేక బీఆర్ఎస్ సభలోను, బయటా నానా గోలచేస్తోందనే భావన జనాల్లో పెరిగిపోతోంది. అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పులను ఇపుడు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకు తోసేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. తాముచేసిన తప్పులను అంగీకరించే నిజాయితీ లేనపుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టకుండా, బురదచల్లకుండా ఉంటే సరిపోయేది. తమ హయాంలో జరిగిన తప్పులను రేవంత్ ప్రభుత్వం ఎక్కడ బయటపెడుతుందో అన్న టెన్షన్ తో ముందే ఎదరుదాడులు చేసినట్లుగా ఉంది హరీష్ ఆరోపణలు. ఇక్కడ హరీష్ మరచిపోయిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలకు రేవంత్ భయపడరని.

తమహయాంలో తప్పులు జరిగాయని అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయటంతోనే కేసీఆర్ అంగీకరించినట్లయ్యింది. మళ్ళీ దీనికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయటం వల్లే ఒరిగేది ఏముంటుందో అర్ధంకావటంలేదు. తనమీద బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్లుగా కాకుండా రేవంత్ డాక్యుమెంట్లతో సహా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతున్నారు. రేవంత్ ధాటిని తట్టుకోలేక, ఆధారాలతో కూడిన ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టలేక చివరకు బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసింది అన్న ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోయింది. అందుకనే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది అని అంటున్నది.

Read More
Next Story