
నేలకొండపల్లిలో బుద్ధ జయంతి
నేలకొండపల్లితో బౌద్ధానికి ఉన్న లింక్ ఏమిటి?
గౌతమబుద్ధుడి 2569 జయంతి నేలకొండపల్లిలో ఘనంగా జరగబోతోంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఈనెల 12వ తేదీన బుద్ధిస్ట్ సొసైటి ఆఫ్ ఇండియా(బీఎస్ఐ) ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో 12వ తేదీన తథాగతుడి జయంతిని ఘనంగా జరిపేందుకు కమిటి అన్నీ ఏర్పాట్లుచేసింది. బుద్ధుడి బోధనలకు ప్రచారం కల్పించటం, కుల, మత రహిత సమాజస్ధాపనకు బుద్ధుడు చేసిన కృషిని సమాజంలో ప్రచారం కల్పించటమే లక్ష్యంగా జయంతిని కమిటి పెద్దఎత్తున నిర్వహించబోతోంది. బుద్ధుడు అనుసరించిన మార్గాన్ని, ప్రవచించిన బోధనలను భవిష్యత్ తరాలకు అందించేట్లు చేయటమే టార్గెట్ గా గౌతమ్ బుద్ధుడి(Gautham Buddha) జయంతిని ఖమ్మం శాఖ ఘనంగా చేస్తోంది.
12వ తేదీన ఉదయం 8 గంటలకు నేలకొండపల్లి(Nelakondapalli) సెంటర్లో తథాగతుని ఊరేగింపు ఉంటుంది. ఉదయం 9 గంటలకు బుద్ధవందనం, పంచశీల ప్రభోదం జరుగుతుంది. తర్వాత 10 గంటలకు జయంతి ఉత్సవ సభ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు భోజన కార్యక్రమం తర్వాత సాయంత్రం 6 గంటలకు బౌద్ధస్ధూపం దగ్గర దమ్మదీపోత్సవం జరుగుతుంది. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా బుద్ధజయంతి ఉత్సవకమిటి కూడా ఏర్పాటైంది.
బుద్ధజయంతి కార్యక్రమం ప్రారంభానికి ముందు నేలకొండపల్లిలోనే ఉన్న బౌద్ధస్ధూపం గురించి తెలుసుకుందాము. జిల్లా కేంద్రం ఖమ్మానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది నేలకొండపల్లి మండల కేంద్రం. నేలకొండపల్లికి పురాణాల్లోనే కాకుండా చరత్రలో కూడా విశేషమైన స్ధానమే ఉంది. ఈగ్రామ చరిత్ర మహాభారతంతో ముడిపడి ఉండటం గొప్ప విశేషమనే చెప్పాలి. మహాభారతం(Mahabharatha)తో ఈ గ్రామం ఏ విధంగా ముడిపడిందంటే బౌద్ధస్ధూపానికి సుమారు మైలు దూరంలోఉన్న దిబ్బలను విరాటరాజు దిబ్బలని, కీచకగుండం అనే స్ధలాలున్నాయి. కీచకగుండం అనే పేరు రావటానికి కారణం ఏమిటంటే ఇక్కడే కీచకుడిని భీముడు చంపి పాతిపెట్టిన స్ధలం కాబట్టే దీన్ని కీచకగుండం అనికూడా స్ధానికులు చెప్పుకుంటుంటారు. ఇక విరాటరాజు దిబ్బలనే పేరు ఎలా వచ్చింది ? ఎలావచ్చిందంటే కౌరవులతో జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు అజ్ఞాతంలో గడిపేందుకు ఉత్తరభారతం నుండి దక్షిణభారతానికి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. దక్షిణభారతంలోని విరాటరాజు దగ్గర తలదాచుకుంటే బాగుంటుందని అనుకుని ప్రస్తుతం నేలకొండపల్లిగా పాపులరైన రాజ్యానికి వచ్చారు. ఈ ప్రాంతం మొత్తం విరాటరాజు పాలనలోనే ఉండేది.
మహాభారతంతో సంబంధం ఏమిటి ?
అందుకనే విరాటరాజు కొలువులో చేరిన పాండవుల్లో కీచకుడిని భీముడు ఇక్కడే చంపాడని స్ధానికుల్లో ప్రచారం ఉంది. నేలకొండపల్లిలోనే ఉన్న బైరాగుల గుట్ట రాళ్ళ కిందనే కీచకుడిని భీముడుని సమాధి చేశాడని పురాణం చెబుతోంది. మహాభారాతాన్ని పక్కనపెట్టేస్తే చరిత్రతోకూడా నేలకొండపల్లికి గట్టి బంధముంది. ద్వాపరయుగం నుండి బౌద్ధులవరకు తర్వాత కాకతీయులు, నిజాం కాలం వరకు నేలకొండపల్లి ప్రాశస్థ్యం కొనసాగింది. ఏవిధంగా అంటే భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి దేవాలయం కట్టించింది కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాసన్న విషయం అందరికీ తెలిసిన చరిత్ర. ఆభక్తరామదాసుది కూడా నేలకొండపల్లే. భక్తరామదాసు చరిత్ర 400 ఏళ్ళయితే నేలకొండపల్లిలో 2 వేల సంవత్సరాల క్రితం బౌద్ధస్థూపాలు బయటపడింది కేవలం 40 ఏళ్ళ క్రితమే. పైన ఫొటోలో కనబడుతున్న బౌద్ధస్ధూపం అంతకుముందు కనిపించేదికాదు. అయితే పొరుగునే ఉన్న ముజ్జుగూడెం గ్రామానికి చెందిన జనాలు పుట్టమన్ను కోసం తవ్వకాలు జరుపుతుండేవారు. అలాంటి తవ్వకాల్లోనే ఒకసారి ఒక నిర్మాణం బయటపడింది. ఏదో నిర్మాణం లాగుందే అనుకుని ముజ్జుగూడెం జనాలు మరింత లోతున తవ్వినపుడు మరింతలోతున నిర్మాణం కనబడింది. దాంతో జనాలు ఆసక్తితో మరింత లోతు, మరింత విశాలంగా తవ్వకాలు జరిపారు. దాంతో నిర్మాణం మొత్తం బయటపడింది. బయటపడిన నిర్మాణాన్ని ఆశ్చర్యంతో చూసిన జనాలు అదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు.
పురావస్తు తవ్వకాల్లో...
దాంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాస్త్రవేత్తలను పిలిపించారు. దాంతో అందరు కలిసి జాగ్రత్తగా పరిశీలించి, పరిశోధనలు చేసిన తర్వాత తేల్చింది ఏమిటంటే ఇది పురాతనమైన బౌద్ధస్ధూపమని. క్రీస్తు శకం 2వ శతాబ్దాంలో బౌద్ధ భిక్షువులు నిర్మించిన స్ధూపమని నిర్ధారణ చేశారు. దాంతో చరిత్రలో నేలకొండపల్లికి విశిష్టమైన స్ధానం దక్కింది. ఎలాగంటే ప్రపంచంలో బౌద్ధమతం బాగా వ్యాప్తిలో ఉన్నపుడు ఇతర ప్రాంతాలకు చెందిన బౌద్ధ భిక్షువులు ఉత్తరాధి నుండి నేలకొండపల్లికి వచ్చి అతిపెద్ద బౌద్ధస్ధూతాపాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. బయటపడిన బౌద్ధస్ధూతం 46 అడుగుల ఎత్తుతో 170 అడుగుల వ్యాసార్ధంతో ఉంది. ఈ స్ధూపానికి దగ్గరలోనే బాలసముద్రం చెరువు కూడా ఉంది.
వందల సంవత్సరాలు బౌద్ధచరిత్ర భూపొరల్లో ఎలా మరుగునపడిపోయిందో అదేపద్దతిలో ద్వాపరయుగం నాటి పౌరాణిక బంధాలు కూడా అలాగే మరుగునపడిపోయాయి. ఇక్కడో పురాణాలకు సంబంధించిన ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. వనవాస సమయంలో పాండవులు తమ బాణాలను బాణాపురంలోని జమ్మిచెట్టుపైన దాచిన విషయం అందరికీ తెలుసు. పాండవులు ఆయుధాలు, బాణాలను దాచిన బాణాపురం గ్రామం ప్రస్తుతం ముదిగొండ మండలంలో ఉంది. మహాభారత కాలంనాటి బాణాపురం, ప్రస్తుత బాణాపురం గ్రామం ఒకటే అని స్ధానికులు గట్టిగా నమ్ముతారు. పురాణాలతో, చరిత్రతో ఎంతో ఘనమైన సంబంధం కలిగిన నేలకొండపల్లిలోనే గౌతమ బుద్ధుడి 2569వ జయంతి ఘనంగా జరుగుతుండటం చాలా గొప్పవిషయమనే చెప్పాలి.