‘పన్ను చెల్లింపుదారులు.. మీ డబ్బును తెలివిగా ఖర్చు చేస్తున్నాం’
బడ్జెట్ లో పన్నుల జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. మధ్యంతర బడ్జెట్ కావడం, రాబోయేది ఎన్నికల కాలం కావడంతో కొన్ని కీలక రంగాలపై మాత్రమే దృష్టి పెట్టారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దేశం సర్వతోముఖంగా, సమ్మిళిత వృద్దిని సాధిస్తోందని, పన్ను చెల్లింపుదారుల డబ్బును తెలివిగా దేశ అభివృద్ది కోసం ఖర్చు చేస్తున్నామని ఆర్థికమంత్రి అన్నారు. భారీగా వరాలు ప్రకటించపోయిన భవిష్యత్ భారత్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఎన్నికల తరువాత రాబోయే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను జూలైలో ప్రవేశపెడుతుంది
పేదలు, మహిళలు, యువత, రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం
వచ్చేది ఎన్నికల కాలం.. కాబట్టి తమకు ఓట్లు రాల్చే అంశాలపై ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా యువత, మహిళలు, పేదలు, రైతులను లక్ష్యంగా పెట్టుకుంది. "దేశంలోని నాలుగు ప్రధాన కులాలు అయిన పేదలు, రైతులు, యువత, మహిళల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత" అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో విశదీకరించారు.
ఈ కేటగిరీ దేశంలోని అన్ని కులాలు, వర్గాలను కవర్ చేస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు. " స్వతంత్రం వచ్చి వందేళ్లు అంటే 2047 పూర్తయ్యే నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజల సామర్థ్యాన్ని మెరుగుపరచాలి. వారికి సాధికారిత కూడా అవసరం" అని నిర్మలా సీతారామన్ అన్నారు. "దేశం పురోగమించాలి అంటే ఈ రంగాలు అభివృద్ధి చెందాలి. ప్రజల సాధికారత, శ్రేయస్సు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది" అని అన్నారు.
ప్రత్యక్ష పన్నుల్లో మార్పులు లేవు
పన్నుల విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు ప్రవేశపెట్టలేదు. దిగుమతి సుంకాలతో సహ ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఒకేరేటు కొనసాగించాలని ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. సావరిన్ వెల్త్ లేదా పెన్షన్ ఫండ్స్ చేసే స్టార్టప్ లు, కొన్ని రకాల పెట్టుబడులకు కొన్ని ప్రయోజనాలు కల్పించారు. అలాగే ఐఎఫ్ఎస్సీ యూనిట్ల నిర్ధిష్ట ఆదాయంపై పన్ను మినహయింపు గడువు తేదీ మార్చి 31, 2024తో ముగుస్తుంది అని దాని గడువును 2025, మార్చి 31 వరకు పొడిగించారు.
ద్రవ్యలోటు సవరణ
2023-24 ఆర్థిక సంవత్సరం జీడీపీ సవరించిన ద్రవ్యలోటు వ్యత్యాసం 5.8 శాతంగా ఉందని ఆర్థికమంత్రి తెలిపారు. FY25కి ఇది జీడీపీలో 5.1 శాతంగా అంచనా వేయగా, 2025-26లో జీడీపీలో 4.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
దేశంలో వైద్య కళాశాలల పెంపు, ఆరోగ్య రంగంలో సంస్కరణలు
ఆరోగ్య రంగంలో కూడా సంస్కరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా వైద్యకళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. చాలామంది యువత తాము వైద్యులు కావాలని కలలు కంటున్నారని, దేశప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నారని ఆర్థిక మంత్రి అన్నారు. వారికి లక్ష్యాలకు అనుగుణంగా వైద్యకళాశాలలను పెంచుతామని వివరించారు.
"9-14 సంవత్సరాల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ ను నిరోధించే టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తుంది " అని ఆర్థికమంత్రి ప్రకటించారు. మాతా శిశు ఆరోగ్య కార్యక్రమం కింద వాటిని తీసుకొచ్చి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని వివరించారు. అలాగే ఇమ్యూనైజేషన్ నిర్వహణ కోసం కొత్తగా రూపొందించిన U-WIN వేదిక, మిషన్ ఇంద్రధనుష్ ద్వారా దేశమంతా విస్తరిస్తామన్నారు. ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సంరక్షణను విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పన్నుదారులు పెరిగారు
2014 నుంచి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. పన్ను రిటర్న్ లు దాఖలు చేసేవారి సంఖ్య 2.4 రెట్లు పెరిగారని ఆర్థికమంత్రి అన్నారు. 2024-25 లో పన్ను వసూళ్ల రూ. 26.06 లక్షల కోట్లుగా అంచనావేయబడింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే ఈ విధంగా పన్నుల వసూళ్లు పెరిగాయని అన్నారు. " పన్ను చెల్లింపుదారుల సహకారం వల్లే దేశం ముందుకు వెళ్తోంది. మీ డబ్బును తెలివిగా ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధికి ఉపయోగించబడిందని నేను హమీ ఇస్తున్న" అని సీతారామన్ అన్నారు.
సొంత ఇంటి కల సాకారం.. సోలార్ పై కప్పు
వచ్చే ఐదు సంవత్సరాలలో అదనంగా రెండు కోట్ల ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తామని ప్రతిపాదించారు. అలాగే రూఫ్ టాఫ్ సోలార్ ప్రక్రియ ద్వారా ప్రతి నెల కోటి కుటుంబాలకు 300 యూనిట్ల విద్యుత్ ను అందించాలనే లక్ష్యాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఈ పథకం వల్ల ప్రతి నెల ఒక్కోఇంటికి దాదాపు రూ. 15000-18000 ఆదా అవుతుందని చెప్పారు. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ లో సాయం, వ్యవస్థాపకులు కొత్తగా రావడం, సాంకేతిక నైపుణ్యాలు, ఇన్ స్టాలేషన్, మెయింటెనెన్స్ కోసం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ పథకం సాయపడుతుందని సీతారామన్ తెలిపారు.
వ్యవసాయ సంస్కరణలు
దేశంలో వ్యవసాయం వేగంగా అభివృద్ది చెందడానికి ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు ప్రొత్సహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పంటల నిల్వ, సరఫరా గొలుసులు, ప్రాథమిక, ద్వితీయ ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలలో ఈ పెట్టుబడుల వలన రైతులకు మేలుజరుగుతుందని అంచనావేశారు. వివిధ పంటలపై నానో డీఏపీ లను దరఖాస్తును అన్ని వ్యవసాయ వాతావరణ మండలాలకు విస్తరింజేయనున్నట్లు సీతారామన్ చెప్పారు. ఆత్మనిర్బర ఆయిల్ సీడ్స్ అభియాన్ కింద ఆవాలు, వేరుసెనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నూనె గింజల సాగులో స్వావలంబన సాధించాలని కూడా బడ్జెట్ లో ప్రతిపాదనలు చేశారు.
టర్న్ ఈస్ట్ ప్రాజెక్ట్
దేశం తూర్పు ప్రాంతాన్ని వేగవంతమైన అభివృద్ధిలో ప్రాముఖ్యత జిల్లాలు, బ్లాక్ లకు సహాయం చేయడానికి ప్రభుత్వం అదనపు శ్రద్ధ వహించాలని తాము ప్రయత్నిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
యువతకు స్వర్ణ యుగం
సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతకు సాయం చేయడానికి రూ. లక్షకోట్ల కార్పస్ ఫండ్, వడ్డీ లేకుండా 50 సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. " కార్పస్ ఫండ్ దీర్ఘకాలిక ఫైనాన్సింగ్, రీఫైనాన్స్ లను అందిస్తుంది. ఇది తక్కువ వడ్డీరేట్లు, లేదా వడ్డీ లేకుండా స్టార్టప్ కంపెనీలకు అందిస్తుంది. ఇవి పరిశోధన, ఆవిష్కరణలను గణనీయంగా పెంచడానికి ఉపయోగపడుతుంది. యువత, సాంకేతిక శక్తిని మిళితం చేసేందుకు ఇవి అవసరం" అని ఆర్థికమంత్రి అన్నారు.
మూడు కీలక రైల్వే కారిడార్లు
మల్టీ మోడల్ కనెక్టీవిటీని ప్రారంభించడానికి, లాజిస్టిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులు తగ్గించడానికి పీఎం గతిశక్తి కింద మూడు కీలక ఆర్థిక రైల్వే కారిడార్ లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అవి
1. శక్తి, ఖనిజ, సిమెంట్ కారిడార్
2.పోర్ట్ కనెక్టివిటీ కారిడార్
3.అధిక ట్రాఫిక్ సాంద్రత గల కారిడార్లు