
తెలంగాణలో మండుతున్న ఎండలు
తెలంగాణలో మండే ఎండలు :హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌తో ప్రభుత్వం అప్రమత్తం
వడగాలుల ముప్పు... ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో ఈ వేసవికాలంలో మండే ఎండలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించనుంది. ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండీ అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో వడదెబ్బ మృతుల సంఖ్యను తగ్గించేందుకు ముందస్తు కార్యాచరణ ఆరంభించబోతుంది.
ఈ వేసవి వెరీ హాట్ గురూ
తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత 40.4 డిగ్రీల సెల్సియస్ కు చేరింది.ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు చేరే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 2026 వేసవి కాలంలో (మార్చి-మే నెలలు) సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.తెలంగాణ మధ్య ద్వీపకల్ప భారత్ విభాగంలో భాగమైనందున మార్చి నుంచి మే నెల వరకు సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.ఈ వేసవి సీజన్‌లో తెలంగాణలో వేడి తరంగాల రోజుల సంఖ్య సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ చెబుతుంది.
వేడి గాలుల ప్రభావం అధికం
తెలంగాణ రాష్ట్రం 1,12,077 చదరపు కిలోమీటర్ల భూ విస్తీర్ణంతో మూడున్నర కోట్లకు పైగా జనాభా నివాసం ఉంటుంది.33 జిల్లాలతోపాటు 141 పట్టణాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు,12,769 గ్రామాలున్నాయి. వేడి వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడింది. నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, జోగులాంబ, నాగర్ కర్నూల్, కరీంనగర్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 2024వ సంవత్సరంలో అత్యధికంగా ఎక్కువ రోజులు వేడిగాలులు వీచాయి. రాష్ట్రంలోని 612 మండలాల్లో 588 మండలాలు వేడిగాలులు వీచాయని ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ,భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర పునరావాస ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వేడిగాలుల కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.
హీట్ వేవ్ ప్లాన్ అమలుకు రాష్ట్ర కమిటీ
రెవెన్యూ శాఖ సెక్రటరీ మెంబర్ కన్వీనర్ గా విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్, పశుసంవర్థక, మత్స్య, పబ్లిక్ హెల్త్, వైద్య ఆరోగ్యశాఖ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసిన్, ఐఎండీ, సమాచార, ఫైర్ సర్వీసెస్ విభాగాల డైరెక్టర్లు సభ్యులుగా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TGDPS)1044 ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ల (AWS) నుంచి వాతావరణ డేటాను సేకరించి అలెర్ట్ జారీ చేస్తుంది. తెలంగాణలోని టాప్ టెన్ హాటెస్ట్ ప్రదేశాల సమాచారాన్ని యాప్ లో పెట్టి ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు.వేసవిలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.5 నుంచి 6.4 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంటే వడగాలులు అని, 47 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంటే తీవ్రమైన వేడిగాలులని ప్రకటించనున్నారు.
కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల,పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట,మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ కన్వీనర్ షేక్ మీరా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ ఆసుపత్రుల్లో వైద్యులు,పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలను సమాయత్తం చేశారు. ఖమ్మం, నిజామాబాద్, భద్రాచలం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశముందని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో ప్రభుత్వం హీట్ వేవ్ కార్యాచరణ ప్రణాళికతో సమాయత్తం అవుతుంది.
ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ రవీందర్ నాయక్
తెలంగాణ రాష్ట్రంలో మండే ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఎండలోకి రావద్దని ఆయన కోరారు. మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని ఆయన సూచించారు.
రోగులు జాగ్రత్తలు పాటించాలి
అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోవడంతోపాటు అత్యవసర వైద్య పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వేడి తరంగాల వల్ల హృద్రోగ సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు తీవ్రం చేస్తుంటాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం రోగులు వేడి తరంగాల నుంచి జాగ్రత్తలు పాటించాలి. గర్భిణులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో వేడిగాలులు వీస్తున్నపుడు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో కార్మికులు పనిచేయకుండా నివారించాలని కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు తాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పశువుల కోసం తొట్టెల్లో మంచినీటిని నింపాలని నిర్ణయించారు.ప్రధాన కేంద్రాల్లో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
వడదెబ్బ తగలొచ్చు జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంలో 2015వ సంవత్సరం నుంచి వడదెబ్బ మృతుల సంఖ్యను పరిశీలిస్తే ప్రతీ ఏటా మండే ఎండల ధాటికి వృద్ధులు నేలకొరుగుతూనే ఉన్నారు. మండుతున్న ఎండలు, వడగాలుల ప్రభావం వల్ల వడదెబ్బ సోకకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 2015వ సంవత్సరంలో అత్యధికంగా వడదెబ్బతో 541 మంది మృత్యువాత పడ్డారు.2016వ సంవత్సరంలో 324 మంది, 2017లో 108 మంది మరణించారు. 2018లో 12 మంది, 2020లో 9 మంది మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2021 వ సంవత్సరం నుంచి వడదెబ్బతో మరణించిన వారున్నా ప్రభుత్వం ఆయా మరణాలను రికార్డు చేయలేదు. 2023వ సంవత్సరం వరకు మూడేళ్ల పాటు వడదెబ్బ మృతుల సంఖ్య లెక్కించలేదు. 2024లో పదిమంది, 2025లో 36 మంది వడదెబ్బతో మరణించారని చెబుతున్నారు.
వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం
వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్రేషియా ప్రకటించింది. హీట్ వేవ్, సన్ స్ట్రోక్ లను వడదెబ్బ మృతులను కూడా స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ గా పేర్కొంది. ఎవరైనా వ్యక్తులు వడదెబ్బకు చనిపోయారని అనుమానం వస్తే తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయించాలి. మరణ ధ్రువీకరణ పత్రం, పోస్ట్ మార్టం రిపోర్టుతో దరఖాస్తు చేస్తే అధికారులు పరిశీలించి నష్ట పరిహారాన్ని చెల్లిస్తారు.
మండుతున్న ఎండలు
తెలంగాణ రాష్ట్రంలో 2016 వ సంవత్సరం నుంచి మార్చి నెలలోనే పది ఉమ్మడి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలలో ఉష్ణోగ్రతలు మార్చి నెలలో అత్యధికంగా 43.5 డిగ్రీల మార్కుకు చేరాయని ఐఎండీ వెల్లడించింది. గత పదేళ్లుగా వేసవికాలంలో మండుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి.ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్న చెప్పారు. బీహార్ ప్రాంతం నుంచి ద్రోణి ఝార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, విదర్భ మీదుగా మరాట్వాడ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని ఆమె తెలిపారు. మంగళవారం, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఆమె వివరించారు.
ఇవీ వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలు
• మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల మధ్య బహిరంగ కార్మికులతో పని చేయించవద్దు.
• తాగు నీటి సరఫరా తగినంతగా ఉండేలా చూడండి - గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
• వృద్ధులు, పిల్లలు, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి.
• ఆరోగ్య నిఘా వ్యవస్థను బలోపేతం చేయండి
• పుష్కలంగా నీరు తాగండి - కనీసం రోజుకు 3-4 లీటర్లు.
• తేలికపాటి, వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించండి.
• మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్ళడం వీలైనంత వరకు తగ్గించండి.
• మిట్ట మధ్యాహ్నం వేళల్లో వాహనాల్లో పిల్లలను వదిలివెళ్లకండి.
మొత్తానికి ఈ ఏడాది తెలంగాణలో వేసవి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌తో ముందస్తు చర్యలు చేపడుతోంది. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వేడి గాలుల నుంచి రక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Next Story

