
బైజూస్ నుంచి రవీంద్రన్ అవుట్! అంతా స్వయం కృతమేనా?
అప్పుడెప్పుడో యాపిల్ సంస్థను పెట్టిన స్టీవ్ జాబ్స్ అదే సంస్థ నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడదే పరిస్థితి ఇండియాలోని బైజూస్ సంస్థ అధినేత రవీంద్రన్‌కి వచ్చింది.
అప్పుడెప్పుడో యాపిల్ సంస్థను పెట్టి దాని కోసం అహర్నిశలు శ్రమించిన స్టీవ్ జాబ్స్ అదే సంస్థ నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడదే పరిస్థితి ఇండియాలోని బైజూస్ సంస్థ అధినేత రవీంద్రన్‌కి వచ్చింది. కార్పొరేట్ వ్యవహరాల్లో ఇదేమీ కొత్త విషయం కాదు. సంస్థలు చేతులు మారడం, లేదా దాన్ని కొనేయడం, షేర్లను మూడో కంటికి తెలియకుండా మార్చేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణం అయింది. కొన్ని స్వయం కృతాలైతే మరికొన్ని కార్పొరేట్ కుట్రలు. స్కూలు పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలను అందించడంలో అందరికీ తెలిసిన బైజూస్ సంస్థ అధినేత బైజూ రవీంద్రన్.. అన్నీ తానై వ్యవహరించారు. కానీ తన సంస్థ నుంచి తానే బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.
అసలు బైజూస్‌లో ఏం జరిగింది?
ఉవ్వెత్తున ఎగిసిన బైజూస్ అధఃపాతాళానికి పడిపోయింది. 22 బిలియన్ డాలర్ల విలువ... అంటే మన కరెన్సీలో దాదాపు లక్షా 75 వేల కోట్ల రూపాయల విలువతో ఒకనాడు చరిత్ర సృష్టించిన బైజూస్ సంస్థ విలువ నేడు అధఃపాతాళానికి పడిపోయి... కేవలం 225 మిలియన్ డాలర్ల స్థాయికి... అంటే రెండు వేల కోట్ల రూపాయల కంటే దిగువకు చేరడంతో.. ఆగ్రహోదగ్నులైన ఇన్వెస్టర్లు.. బైజూస్ సంస్థ డైరెక్టర్ల పదవి నుంచి బైజూ రవీంద్రన్‌ను, ఆయన భార్య దివ్యను, సోదరుడు రిజూ రవీంద్రన్‌ను తొలగించాలని వాటాదారుల సర్వసభ్యసమావేశానికి నోటీసు ఇచ్చారు. బైజూస్ సంస్థలో ప్రమోటర్లయిన బైజూ రవీంద్రన్ కుటుంబానికి దాదాపు 26 శాతం వాటా ఉండగా, వారిని తొలగించాలని నోటీసు ఇచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్లకు 30శాతానికి పైగా వాటా ఉంది.
రవీంద్రనే కారణమా...
ఏ స్కూలు పిల్లవాడిని అడిగినా చటుక్కున పేరు చెప్పగలిగే బైజూస్ సంస్థ ఒకనాడు ఓ వెలుగు వెలిగి..నేడు ఇంత దీనస్థితికి చేరడానికి ప్రధాన కారణం ఆ సంస్థ ప్రమోటర్లయిన బైజూ రవీంద్రన్, ఆయన కుటుంబ సభ్యులే. బైజూస్‌ను నిర్వహించే అసలు కంపెనీ పేరు థింక్ అండ్ లెర్న్ ప్రయివేట్ లిమిటెడ్. అయితే బైజూస్ నిర్వహణ తీరు చూస్తే ఏ మాత్రం ఆలోచించకుండా, ఏ మాత్రం నేర్చుకోకుండా, ఏ మాత్రం ముందూ వెనకా చూడకుండా కార్యకలాపాలు నిర్వహించినట్టు అనిపిస్తోంది. అంటే కంపెనీ పేరులో ఏముందో..కచ్చితంగా దానికి పూర్తి విరుద్ధమైన తీరులో వ్యాపారం నిర్వహించారు.
బైజూస్ సంస్థలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ రాక్, ప్రోసస్, జనరల్ అట్లాంటిక్, సోఫినా, పీక్ ఎక్స్‌వీ పార్టనర్స్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడి పెట్టాయి. సంస్థ విలువను దశలవారీగా పెంచుకుంటూ పోయిన బైజూస్, మొత్తం మీద వివిధ దశల్లో... దాదాపు ఐదు బిలియన్ డాలర్లను అంటే 40వేల కోట్లరూపాయలకు పైగా మొత్తాన్ని పలు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది.
ఫలితాలు వెల్లడించడానికి వచ్చిన ఇబ్బందులు ఏమిటీ?
వార్షిక ఆర్థిక ఫలితాలను వెల్లడించడంలో విపరీతమైన జాప్యం చేయడంతో పాటు 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో, బైజూస్ వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది.
మహేశ్ బాబు కూడా ప్రచారకర్తే...
మహేశ్‌బాబు, షారూఖ్‌ఖాన్, హృతిక్ రోషన్ లాంటి సినిమా స్టార్లను, మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడిని వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు టైటిల్ స్పాన్సర్‌గా భారీ మొత్తం చెల్లించిన బైజూస్ సంస్థ..వ్యాపార నిర్వహణలో మాత్రం ఉల్లా పల్టా అనే రీతిలో వ్యహరించింది. లాభాలు వస్తాయో లేదో ఖచ్చితంగా తెలియకున్నా...పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా కొండకు వెంట్రుక కట్టినట్టుగా బైజూస్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. పునాదులు లేని పేకమేడను బైజూస్ నిర్మిస్తోందని వారు గ్రహించలేకపోయారు.
స్కూల్ పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పే స్థాయి నుంచి, ఏకంగా మనదేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసులకు, అంటే IAS, IPSవంటి పోస్టులకు నిర్వహించే UPSC పోటీపరీక్షలకు కూడా శిక్షణ ఇస్తామని బైజూస్ ఊదరగొట్టింది. ప్రకటనల పేరుతో ఎక్కడ చూసినా మారుమోగిపోయిన బైజూస్ సంస్థ...ఆచరణలో మాత్రం లాభాలు రాని వ్యాపారం నిర్వహించింది. పేకమేడను నిర్మించింది. లాభాలు రాని వ్యాపారం అసలు వ్యాపారం కిందకే రాదనే వ్యాపార సూత్రాన్ని కూడా బైజూస్ సంస్థ మరిచిపోయింది. బైజూస్‌లో పెట్టుబడి పెట్టిన పలువురు ఇన్వెస్టర్లు కూడా దాదాపు అంతా మునిగిపోయేదాకా...ఇలాగే కళ్లకు గంతలు కట్టుకుని కూర్చున్నారు. వ్యాల్యూయేషన్ మాయలో మునిగిపోయి, వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉన్నారు.
2019వ సంవత్సరంలో ఎనిమిదికోట్ల రూపాయాల నష్టాన్ని పొందిన బైజూస్ సంస్థ...2020 ఆర్థిక సంవత్సరంలో 262 కోట్ల రూపాయల నష్టాన్ని, 2021 ఆర్థిక సంవత్సరానికి 4వేల564 కోట్ల రూపాయల నష్టాన్ని, 2022 ఆర్థిక సంవత్సరానికి 8వేల245 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఆదాయం విషయానికొస్తే 2021లో 2,428 కోట్లు, 2022లో 5,298 కోట్లుగా ఉంది. అంటే ఆదాయం కంటే చాలా ఎక్కువగా నష్టం వచ్చింది. మరోరకంగా చెప్పాలంటే..ఖర్చులో సగభాగం కూడా ఆదాయంగా రాలేదు. ఇవన్నీ పాత లెక్కలే. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంత నష్టం వచ్చిందో బైజూస్ ఇంకా వెల్లడించాల్సి ఉంది. రానురానూ గడ్డపరిస్థితులు ఎదుర్కోవాల్సిరావడంతో గడచిని ఏడాది కాలంలో బైజూస్ సంస్థ దాదాపు 5వేలమంది ఉద్యోగులను తొలగించింది. ఇంతకంటే చేయగలిగిందేదీలేదని చేతులెత్తేసింది.
2022 అక్టోబర్ నుంచే మొదలు...
2022 అక్టోబరు నుంచి పరిస్థితులు చేజారుతూ...అప్పులు చెల్లించలేని పరిస్థితులు ఎదురవ్వడంతో..సంస్థ విలువ 22 బిలియన్ డాలర్ల నుంచి కేవలం 225 మిలియన్ డాలర్ల దిగువకు..అంటే 99శాతం మేరకు పడిపోవడంతో..కనీసం ఉన్న ఒక్కశాతం విలువైననా కాపాడుకోవాలనే ఉద్దేశంతో, బైజూస్‌లో పెట్టుబడి పెట్టిన సంస్థాగత ఇన్వెస్టర్లు కన్నెర్ర చేస్తూ...బైజూ రవీంద్రన్‌ను, ఆయన ఇద్దరు కుటుంబ సభ్యులను బైజూస్ డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగించాలని నోటీసు జారీ చేశారు. ఈ పరిణామం మున్ముందు ఎలా ఉంటుందో...ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమైనప్పటికీ, ఒకవేళ కంపెనీ నుంచి తొలగించినా...బైజూర్ రవీంద్రన్‌కు ఇప్పుడు పెద్దగా పోయేదేం లేదు. మునిగేది మాత్రం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లే!

