
మావోయిస్టు డెన్ లో రేవంత్ క్యాబినెట్ మీటింగ్
ములుగు జిల్లా అడవులు అంటేనే మావోయిస్టుల(Maoists) డేంజర్ జోన్ అన్న విషయం అందిరికీ తెలిసిందే
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పెద్ద సాహసమే చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం మేడారంలో మంత్రివర్గ సమావేశాన్ని(Revanth Cabinet meeting) నిర్వహించబోతున్నాడు. సచివాలయం బయట క్యాబినెట్ మీటింగ్ జరగటం ఇదే తొలిసారి. సచివాలయం బయట అదికూడా మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించాలని అనుకోవటం పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే (Medaram)మేడారం అన్నది ములుగు(Mulugu Forest) జిల్లాలో ఉంటుంది. ములుగు జిల్లా అంటేనే మావోయిస్టుల(Maoists) డేంజర్ జోన్ అన్న విషయం అందిరికీ తెలిసిందే. ములుగు జిల్లా అడవులకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంతో సరిహద్దులున్నాయి. కాబట్టి అటు ఛత్తీస్ ఘడ్ అడవులు, ఇటు ములుగు జిల్లా అడవులు మావోయిస్టులకు పెట్టని కోటలుగా నిలుస్తున్నాయి.
తాజా పరిణామాల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని భారీగా చేస్తోంది. రాబోయే మార్చి 31వ తేదీతో దేశంలో మావోయిస్టు అన్న వాడే లేకుండా చేయాలన్నది నరేంద్రమోదీ, అమిత్ షా పట్టుదల. ఇందులో భాగంగానే మావోయిస్టుల కోసం భద్రతాదళాలు జల్లెడపట్టి దంతెవాడ, కర్రెగుట్టలు, అబూజ్ మడ్ నేషనల్ పార్క్ అడవుల్లో వరుసబెట్టి ఎన్ కౌంటర్లతో చంపేస్తున్నాయి. లొంగిపోవటమో లేకపోతే ఎన్ కౌంటర్లో చనిపోవటమో ఏదో ఒకటే జరగాలన్న పట్టుదలతో భద్రతాదళాలు ఆపరేషన్ కగార్ యజ్ఞాన్ని నిర్వఘ్నంగా జరుపుతోంది.
ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు అగ్రనేతల్లో కేంద్రప్రభుత్వంపై బాగా మండిపోతోంది. అయితే ప్రస్తుత ప్రతికూల పరిస్ధితుల కారణంగా ఏమీ చేయలేకపోతున్నాయి. అయినా అక్కడక్కడ భద్రతాదళాలపై మావోయిస్టులు దాడులుచేసి దెబ్బతీస్తునే ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పోలీసులను ఎప్పుడు దెబ్బతీద్దామా అని మావోయిస్టు అగ్రనేతలు ప్లాన్ చేస్తుంటారనటంలో సందేహంలేదు. అందుకనే ములుగు జిల్లాలోని మేడారంలో రేవంత్ క్యాబినెట్ సమావేశం అవుతుండటం సంచలనంగా మారింది.
ములుగులో టెన్షన్ టెన్షన్
పోయిన సంవత్సరంలో వందలాదిమంది మావోయిస్టులు లొంగిపోగా మరికొన్ని వందలమంది చనిపోయారు. లొంగిపోతున్న మావోయిస్టు నేతలు వేరేదారిలేక ప్రాణభయంతో మాత్రమే పోలీసులకు లొంగిపోతున్నారు. అయినా కొందరు నేతలు ఇంకా అజ్ఞాతంగా అడవుల్లోనో లేకపోతే మైదాన ప్రాంతాల్లోనో తలదాచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ములుగు అడవుల్లో మావోయిస్టుల సంచారం ప్రభుత్వాన్ని కలవరపరుస్తునే ఉంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే క్యాబినెట్ సమావేశాన్ని మేడారంలో నిర్వహించాలని రేవంత్ నిర్ణయించటం సంచలనంగా మారింది. అడవుల్లోనో లేకపోతే అజ్ఞానంలోనో ఉన్న మావోయిస్టులు తెగిస్తే మేడారంలో ఆదివారం జరగబోయే క్యాబినెట్ సమావేశం సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుంది.
3 కోట్లమంది పాల్గొంటారని అంచనా
ఈనెల 28-31 మధ్య మేడారంలో సామ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రఖ్యాతిగాంచింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్రలోని గిరిజనులంతా పాల్గొంటారు. 3 కోట్లమంది గిరిజనులు జాతరలో పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంత ప్రాశస్త్యం కలిగిన జాతర జరిగే మేడారంలోనే రేవంత్ తన క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. నిర్ణయం తీసుకున్నది రేవంతే అయినా పోలీసుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టు ప్రభావ ప్రాంతంలో క్యాబినెట్ సమావేశం జరగటం అంటే మామూలు విషయంకాదు. క్యాబినెట్ సమావేశం అంటే రేవంత్, మంత్రులే కాదు చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, సీనియర్ మోస్ట్ పోలీసు ఉన్నతాధికారులు ఎంతోమంది హాజరవుతారు.
ఇంతమందికి తగిన భద్రత కల్పించటంలోనే పోలీసు ఉన్నతాధికారులు టెన్షన్ పడుతున్నారు. మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో జరగబోయే క్యాబినెట్ సమావేశంకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. క్యాబినెట్ సమావేశానికి భద్రత కల్పించటం పోలీసుశాఖ ప్రిస్టేజిగా తీసుకున్నదనే చెప్పాలి. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ స్వయంగా మేడారంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణకు డీజీపీ బీ శివధరరెడ్డి ఐదుగురు ఎస్పీ ర్యాంకు అధికారులు, మరో నలుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో 1500 మంది పోలీసు అధికారులు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. వీరుకాకుండా భద్రతాదళాలు ములుగు అడవుల్లో రెగ్యులర్ గా కూంబింగ్ చేస్తున్నారు.
హరితలోనే రేవంత్ బస
రేవంత్, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు కీలకమైన అధికారులు ఆదివారం సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. మేడారంలోని హరిత హోటల్లో క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రికి అక్కడే బసచేస్తారు. సోమవారం ఉదయం జాతరకోసం చేసిన ఏర్పాట్లను రేవంత్, మంత్రులు పరిశీలిస్తారు. జాతర కోసం నిర్మించిన గద్దెలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. హరిత హోటల్లో రేవంత్, మంత్రులు బసచేస్తారు. అందులోనే ఏర్పాటుచేసిన టెంట్ సిటీలో 40 తాత్కాలిక గదుల్లో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, అడిషినల్ డీజీ ర్యాంకు అత్యున్నతస్ధాయి అధికారులుంటారు. తాడ్వాయి హరిత హోటల్, ములుగులోని వసతి గృహం, లక్నవరం, గోవిందరావుపేట, పస్రా, రామప్పలోని హోటళ్ళల్లో మిగిలిన సెక్రటరీలు, విభాగాధిపతులు తదితరులుంటారు.
రెడ్ జోన్ లాంటి సున్నితమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు అసాధారణమైన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హరిత హోటల్ తో పాటు ఇతర అధికారులు బసచేయబోయే ప్రాంతాల్లో కూడా భారీ పోలీసు భద్రతను ఏర్పాటుచేశారు.

