‘కాగ్’ అక్షింతలు: తెలంగాణలో రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి
x
తెలంగాణ సచివాలయం (ఫొటో కర్టసీ : తెలంగాణ సమాచారశాఖ)

‘కాగ్’ అక్షింతలు: తెలంగాణలో రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి

స్టేడియాల నుంచి సంక్షేమ పథకాల వరకు… నిధుల దుర్వినియోగం బట్టబయలు


తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తీవ్రమైన లోపాలు వెలుగుచూశాయి. కోట్ల రూపాయల ప్రజాధనం సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంతో వృథా అయినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక స్పష్టం చేసింది. స్టేడియాల నిర్మాణం నుంచి గ్రామీణ రోడ్లు, సంక్షేమ పథకాల వరకూ అనేక రంగాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు వెల్లడవడంతో ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం పక్కదారి పట్టింది.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల నిధులు దుర్వినియోగం అయ్యాయని సాక్షాత్తూ కంప్రోల్టర్ అండ్ ఆడిటింగ్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

స్టేడియం భవనాలపై రూ.2.3 కోట్ల వృధా వ్యయం

తెలంగాణ రాష్ట్రంలో స్టేడియాల నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో ప్రజాధనం వృధా అయింది.ఆర్థిక ఆమోదం లేకుండానే పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లింపులు జరపడంలో జాప్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా రూ.2.32 కోట్ల వ్యయం చేసినప్పటికీ స్టేడియం భవనాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. దీనివల్ల రాష్ట్రంలో రూ.2.32 కోట్ల ప్రజాధనం వృధా అయింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా స్టేడియాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యం కూడా నెరవేరలేదు.రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల ఆధునీకరణ, అభివృద్ధి విధానంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దశలవారీగా క్రీడా స్టేడియంలను నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 105 స్టేడియం పనుల్లో, 52 మాత్రమే పనులు పూర్తయ్యాయి. 42 స్టేడియాల నిర్మాణ పనులు అసలు చేపట్టలేదు. ఆరు స్టేడియం నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక స్టేడియం న్యాయపరమైన వివాదంతో కోర్టు కేసు నడుస్తోంది. మిగిలిన నాలుగు స్టేడియాల నిర్మాణ పనులు 2023 మార్చి నాటికి మధ్యలోనే నిలిపివేశారు.

అసంపూర్తిగానే...

- జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బిచ్ కుందలో స్టేడియం నిర్మాణ పనులు చేపట్టి రూ.82.87 లక్షలు వెచ్చించారు. కానీ స్టేడియం, ట్రాక్,క్రీడా కోర్టుల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఈ నిధులు వ్యర్థంగా మారాయి.
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో మినీ స్టేడియం నిర్మాణం అసంపూర్తిగా వదిలేశారు. 85.55 లక్షలతో స్టేడియం పనులు చేపట్టి వాటిని అసంపూర్తిగా వదిలేయడం వల్ల అది నిరుపయోగంగా మారడంతోపాటు ప్రజాధనం వ్యర్థం అయింది.
- నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ లో మినీస్టేడియం నిర్మాణానికి 20.22 లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని అసంపూర్తిగా వదిలేశారు.
- మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్ లో ఇండడోర్ స్టేడియం నిర్మాణానికి 1.25 కోట్లను మంజూరు చేసి పనులు చేపట్టారు. రూ. 43. 68లక్షలతో పనులు చేసి, దాన్ని అసంపూర్తిగా వదిలేశారు. దీనివల్ల స్టేడియం నిరుపయోగంగా మారింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, దోమకొండ, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లో స్టేడియాల నిర్మాణాలు పూర్తి కాకపోవడాన్ని కాగ్ తప్పుపట్టింది.

కాగ్ అక్షింతలతోనైనా ప్రభుత్వ తీరు మారాలి : బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకువచ్చి చేస్తున్న అభివ‌ృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్ ఆక్షేపించిందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అప్పులపై వడ్డీని తగ్గించడంతో పాటు పదేళ్ల కాలపరిమితిని 30 ఏళ్లకు పెంచిందని,కానీ రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలు సజావుగా చేయడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, బిల్లులు చెల్లించక పోవడం వల్ల పనులు అసంపూర్తిగా మిగిలాయన్నారు. రాష్ట్రంలో ఆదాయం పెరగక పోగా, అప్పులు మాత్రం పెరిగాయని పాయల శంకర్ చెప్పారు. కాగ్ అక్షింతలు వేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధానాలను సరిచేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో కోట్ల రూపాయలు వెచ్చించినా మిషన్ భగీరథ పథకం కింద ప్రజలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది అని ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కాగ్ అక్షింతలు

రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లోని సమస్యలను కాగ్ ఎత్తి చూపింది. జహీరాబాద్ నిమ్జ్, హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం భూసేకరణలో ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జాప్యం జరిగిందని కాగ్ ఆక్షేపించింది.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ రాష్ట్రంలో అమలు తీరుతెన్నులపై కాగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. పథకం అమల్లో లోపాలు ఉన్నాయని, పురపాలక సంస్థలు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం మధ్య సమన్వయం లేదని, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పనులు పూర్తి కాలేదని పేర్కొంది.

గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు

గ్రామీణ రోడ్ల నిర్మాణంలో పలు లోపాలు ఉన్నట్లు కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. తగిన సర్వే చేయకుండా పలు రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారని, కొన్నిచోట్ల అటవీ అనుమతులు లేక పనులు ముందుకు సాగలేదు. బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్​ పనులు పూర్తి కాకపోవడంతో ఎనిమిదేళ్లు గడిచినప్పటికీ కొన్ని గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ సాధ్యం కాలేదు.కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో ఆయా రోడ్లపై మూడు నెలల్లోనే గుంతలు పడ్డాయి.ఆదిలాబాద్ జిల్లాలోని హాషింపూర్, సావాపూర్ గ్రామాల్లో చేపట్టిన బ్రిడ్జీ కం చెక్ డ్యామ్ ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని కాగ్ ఎత్తి చూపించింది. సావాపూర్ గ్రామాన్ని కలుపుతూ రోడ్డు నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్ల నిర్మాణం చేపట్టినా గుంతలు పడ్డాయి. సిద్ధిపేట జిల్లా కోహెడ్-ఆరెపల్లి రోడ్డు, ఆదిలాబాద్ జిల్లా లెండిగూడ రోడ్డు నిర్మాణ లోపాలతో అద్వానంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా లాండ సాంగ్వి రోడ్డు, సిద్ధిపేటజిల్లాలోని అంగది కిష్టాపూర్- ఇప్పాల గూడ రోడ్డుపై గుంతలు పడ్డాయి. ఆదిలాబాద్ లెండిగూడ రోడ్డుపై నెర్రలు పడ్డాయి. సిద్ధిపేటలోని ములుగు తుంకీ రోడ్డు నిర్మాణ లోపంతో దెబ్బతింది.

అనర్హులకు సంక్షేమ పథకాలు

కల్యాణలక్ష్మి పథకంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు, అనర్హులకు లబ్ధి జరగకుండా చూసేలా సరైన వ్యవస్థ, డేటా తనిఖీకి తగిన విధానం లేదని కాగ్ పరిశీలనలో వెల్లడైంది. ఫలితంగా చిన్న వయస్సు ఉన్న వారికి, ఆదాయం ఎక్కువ ఉన్న వారికి కూడా కల్యాణలక్ష్మీ పథకం కింద లబ్ధి చేకూర్చారు. అర్హత లేని వారికి రూ.55 కోట్లకు పైగా చెల్లింపులు చేశారని కాగ్ ఆక్షేపించింది. తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్ సాధికారత కార్యక్రమం కింద అనర్హులైన లబ్ధిదారులకు రూ.1.75 కోట్ల సబ్సిడీని మంజూరు చేశారని కాగ్ రిపోర్టులో వెల్లడైంది. తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్ సాధికారత కార్యక్రమం అనర్హులైన లబ్ధిదారులకు అందించిన ప్రయోజన మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

రూ.2.35 కోట్ల ప్రజాధనం వృథా

మైనారిటీ విద్యార్థుల ఐటీ నైపుణ్యాలను పెంపొందించడానికి, ఉర్దూ భాషా ప్రోత్సాహం కోసం ఉద్దేశించిన ఉర్దూ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు, ఉర్దూ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు కమ్ లైబ్రరీలను వినియోగించుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ లో రూ.2.35 కోట్ల ప్రజాధనం వృధా అయింది.మైనార్టీ విద్యార్థుల కోసం శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయాలు,ఉర్దూ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినా, వాటిని ఉపయోగించకపోవడంతో ప్రజాధనం వృథా అయింది. పౌర సరఫరాల శాఖ అనర్హులకు రేషన్ కార్డులను మంజూరు చేసింది. 83,545 మంది అనర్హులైన లేదా మరణించిన లబ్ధిదారులను గుర్తించడానికి సరైన యంత్రాంగం కొరవడింది. దీని ఫలితంగా రూ.135.16 కోట్ల మేర అక్రమ వ్యయం జరిగింది. ఈ కేసుల్లో మరణించిన 309 మంది వ్యక్తులు, మోసపూరితమైన క్లెయిమ్‌ల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.6.31 లక్షల నష్టం వాటిల్లింది.

ప్రాజెక్టుల నిర్మాణంలోనూ నిధులు వృధా

భూసేకరణ, పునరావాస సమస్యలను పరిష్కరించకుండానే చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం వల్ల 16 సంవత్సరాలు గడిచినా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్దేశిత ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందించాలనే లక్ష్యం కూడా నెరవేరలేదు.మొండికుంటవాగు, చిన్న సుద్దవాగు ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టు సంస్థకు పని అప్పగించడంతో పాటు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చినప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈ అసంపూర్ణ ప్రాజెక్టుపై ఇప్పటివరకు వెచ్చించిన రూ.19.38 కోట్ల వ్యయం వృధా అయ్యింది. మోడికుంటవాగు ప్రాజెక్టు పనులను అప్పగించడానికి కాంట్రాక్టు సంస్థకు మొబిలైజేషన్ అడ్వాన్స్ (పనుల ప్రారంభానికి ముందస్తు చెల్లింపు) విడుదల చేశారు. ఈ నిధులను విడుదల చేయడానికి ముందే నీటిపారుదల,ఆయకట్టు అభివృద్ధి (I&CAD) శాఖ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయలేదు.అటవీ అనుమతులను పొందలేదు. అంతేకాకుండా, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంక్ గ్యారెంటీలను నగదుగా మార్చుకోవడంలో ఆ శాఖ చేసిన జాప్యం వల్ల సర్కారుకు తీరని నష్టం జరిగింది. రూ. 6.89 కోట్ల వడ్డీని వసూలు చేయకపోవడం వల్ల సదరు కాంట్రాక్టు సంస్థకు అనవసరమైన లబ్ధి చేకూరింది.

సంక్షేమ కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగం : డాక్టర్ లుబ్నా సార్వత్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని సామాజిక ఉద్యమ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రమజాన్ నెలలో ఇఫ్తార్ పేరిట రూ.66కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. పేదలకు చేరాల్సిన సంక్షేమ ఫలాలను పెద్దలకు పంపిణీ చేశారని ఆమె చెప్పారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించి అసలైన నిరుపేదలకు పథకాలు అందేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.

నష్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు, వాటిలో 16 సంస్థలు మూతపడినట్టు లేదా లిక్విడేషన్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.విశ్లేషణకు తీసుకున్న 18 సంస్థల్లో 11 నష్టాల్లో ఉన్నాయని, కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని కాగ్ తెలిపింది. తొమ్మిది సంస్థల నెట్‌ విలువ పూర్తిగా నష్టాలతో కరిగిపోయినట్టు వెల్లడించింది.ప్రభుత్వరంగ సంస్థలకు కాగ్ పలు సిఫారసులు చేసింది. నష్టాల్లో ఉన్న కంపెనీల పనితీరుని సమీక్షించాలని సూచించింది.
మొత్తంగా కాగ్ నివేదిక తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉన్న లోపాలను స్పష్టంగా బహిర్గతం చేసింది. ప్రణాళికలోపం, పర్యవేక్షణ లోపం, సమన్వయం లేకపోవడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై విధానాలను సరిచేసుకుని, నిధుల వినియోగంలో పారదర్శకతను తీసుకువచ్చి, నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Read More
Next Story