
మంత్రివైఉండి కల్నల్ ఖురీషీని అలాంటి మాటాలు ఎట్లా మాట్లాడతావ్?
"కల్నల్ సోఫియా ఖురేషికి క్షమాపణ చెప్పి కోర్టు మెట్లు ఎక్కండి!
భారతీయ సైన్యాధికారి కల్నల్ సోఫియా ఖురేషీపై ఓ మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. సోఫియాపై బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఘాటుగా స్పందించి ఆ మంత్రిపై తక్షణమే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని ఆదేశించింది. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు, ఆదేశాలు ఇచ్చిన హైకోర్టుపై ఆ మంత్రివిజయ్ షా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఇక్కడా ఆ మంత్రికి చుక్కెదురైంది.
అసలేం జరిగిందంటే...
పాకిస్థాన్‌పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ వివరాలు మీడియాకు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీ. ఆమెపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనను నేరుగా కోర్టు మెట్ల వరకు తీసుకొచ్చాయి. ‘‘ఆమె ఉగ్రవాదుల సోదరి’’ అంటూ మాట్లాడుతూ దేశ సైన్యాన్ని కించపరిచిన మంత్రి, ఇప్పుడు కోర్టు గదిలో క్షమాపణ చెప్పాల్సిన ఆత్మరక్షణ పరిస్థితిలో పడిపోయారు.
హైకోర్టు స్వచ్ఛందంగా విజయ్ షా వ్యాఖ్యల్ని కేసుగా పరిగణించి మంత్రి వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. జస్టిస్ అతుల్ శ్రీధరణ్, జస్టిస్ అనురాధ శుక్లాలతో కూడిన ధర్మాసనం, ‘‘ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొడతాయి’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దీనిపై విజయ్ షా సుప్రీంకోర్టుకు వచ్చారు. హైకోర్టు ఆదేశాలపై ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి పిటిషన్‌ను రేపు (మే 16న) విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అంతేగాకుండా ఆయన తీరును తప్పుపట్టింది. ‘‘ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి’’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో మంత్రి విజయ్ షా సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. ఆయన ఇప్పుడు ఏమి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్షమాపణ చెప్పి సరిపెడతారా లేక తన వ్యాఖ్యలకు కట్టుబడి కేసును ఎదుర్కొంటారో వేచి చూడాల్సి ఉంది.
ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా స్పందించింది. మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించింది. బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్వయంగా స్పందిస్తూ మంత్రి విజయ్ షాను ‘‘మూర్ఖుడు’’ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ – ‘‘ఇంతకాలం మంత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని’’ నిలదీసింది.
Next Story