
తెలంగాణ సైబర్‌క్రైమ్ హెడ్‌క్వార్టర్స్‌గా కాంబోడియా!
తెలంగాణ కేసుల్లో భారీ మోసాలకు విదేశీ నెట్వర్క్ లింకులు బయటపడగా, యువతను ఉద్యోగాల పేరుతో విదేశాలకు తీసుకెళ్లి మోసాలకు వినియోగిస్తున్నారు.
సైబర్ నేరాలు.. రోజురోజుకు భూతంలా మారుతున్న సమస్య. అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక దారిన సైబర్ నేరగాళ్లు మార్గం వెతుక్కుంటున్నారు. తమ మాయమాటలతో మాజీ అధికారులు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులను సైతం సులభంగా బురిడీ కొట్టించేస్తున్నారు. తాజాగా ఈ సైబర్ నేరాల హెడ్‌క్వార్టర్స్ ఆచూకీని కనుగొన్నారు తెలంగాణ పోలీసులు. తెలంగాణలో జరుగుతున్న సైబర్ నేరాల్లో సుమారు 66.66 శాతం నేరాలకు పునాదులు కాంబోడియాలో పడుతున్నాయని గుర్తించారు. తెలంగాణ ఒక్కటే అని కాదు.. ఇండియాను టార్గెట్‌గా చేసుకుని చేస్తున్న సైబర్ నేరాలు, దాడులకు కాంబోడియా విదేశీ కార్యకలాపాల హెడ్‌క్వార్టర్స్‌గా పనిచేస్తోంది. తెలంగాణలో జరుగుతున్న ప్రతి 3 సైబర్ నేరాల్లో రెండు నేరాలు కాంబోడియా కేంద్రంగానే జరుగుతున్నాయని అధికారుల దర్యాప్తులో తేలింది.
తెలంగాణలో రూ.50లక్షలకు పైగా విలువ కలిగిన సైబర్ నేరాల్లో 70శాతం కేసులు కాంబోడియాతో లింకులు కలిగిఉన్నాయని గుర్తించారు. అనేక పెట్టుబడి మోసాలు, డిజిటల్ స్కామ్ మోసాల్లో జరిగిన లావాదేవీలు, ఐపీ అడ్రెస్‌లను ట్రాక్ చేస్తే వాటిలో అధికశాతం కాంబోడియా వైపే వెళ్లాయని అధికారులు వెల్లడించారు. మయన్మార్ వంటి కొన్ని పొరుగు దేశాల్లో భారత దర్యాప్తు సంస్థలు చేసిన కొన్ని క్రాక్‌డౌన్స్ వల్ల కొన్ని సైబర్ నేరాలు జరగకముందే దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఈ సైబర్ ఫ్రాడ్ విషయంలో కాంబోడియా కీలక పాత్ర పోషిస్తూనే ఉందని, స్కామ్ నెట్వర్క్స్‌ను రన్ చేయడంలో హెడ్‌క్వార్టర్‌లా పనిచేస్తోందని పేర్కొన్నారు అధికారులు.
కాంబోడియాలో కొత్త చట్టం
ఇటీవల పెరిగిపోతున్న సైబర్ సెక్యూరిటీ సమస్యల కారణంగా కాంబోడియా దేశం సరికొత్త సైబర్ క్రైమ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 3 నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా కాంబోడియాలో జరుగుతున్న సైబర్ నేరాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా సైబర్ మోసాలకు పాల్పడితే ఈ చట్టం కింద వారికి కఠిన శిక్షలు తప్పవని ఆ దేశం వెల్లడించింది. ఈ చట్టం కింద నేరస్థులకు 2నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, సుమారు 1,25,000 డాలర్ల జరిమానా విధించనున్నట్లు ఆ దేశ చట్టసభలు వెల్లడించాయి. గ్యాంగులుగా మారి సైబర్ నేరాలు చేయడం, భారీ సంఖ్యలో బాధితులు ఉన్న క్రమంలో ఈ శిక్షల్లో మార్పులు ఉంటాయని, ఆ సమాయాల్లో జైలు శిక్ష 10 సంవత్సరాలకు పెరుగుతుందని, దాంతో పాటుగానే 2,50,000 డాలర్ల ఫైన్ కూడా ఉంటుందని స్పష్టం చేసింది.
మనీలాండరింగ్, డాటా హార్వెస్టింగ్, స్కామ్‌లు చేయడానికి రిక్రూట్‌మెంట్ చేసుకోవడం కూడా ఈ చట్టం కిందకే వస్తాయి. అయితే కాంబోడియా ఈ చట్టం తీసుకురావడం ద్వారా సైబర్ గ్యాంగులు బలహీనపడతాయా లేదా వేర ప్రాంతానికి షిఫ్ట్ అవుతాయా అన్న నేపథ్యంలో చట్టాన్ని అమలు చేయడం కూడా కాస్తంత కష్టమే అవుతుందని తెలంగాణ సైబర్ అధికారులు పేర్కొన్నారు.
కాంబోడియాలో ఉద్యోగం పేరుతో సైబర్ డెన్‌లలోకి బలవంతంగా తీసుకెళ్లబడిన తెలంగాణ ప్రజలు అనేక మంది ఇప్పుడు బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ ఎస్‌పీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా కాంబోడియా, తెలంగాణ మధ్య జరుగుతున్న స్కామ్ ఎకానమీలో రెండు లేయర్ల సిస్టమ్ ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ అధికారులు చేసిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.
ఇండియాలోనే రిక్రూట్‌మెంట్
ఇండియాలో కొన్ని నెట్వర్క్‌లు రిక్రూట్‌మెంట్ ఏజెంట్స్, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ సిమ్ కార్డ్‌లు, మ్యూల్ మనీ ఛానెల్స్ వంటి వాటి ద్వారా ఈ సైబర్ డెన్స్‌కు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు అధికారులు. ఇక రెండో లేయర్ కాంబోడియాలో ఉంది. జాబ్ పేరుతో అక్కడు తీసుకెళ్లిన వారిని పాస్‌పోర్ట్‌లు లాగేసుకుని, బెదిరించి బలవంతంగా ఈ దందాలోకి దించి, వారి చేత భారతీయులను టార్గెట్ చేయిస్తున్నారని అదికారులు చెప్పాయి.
ఈ వ్యవస్థలో కీలకంగా మారింది ప్రీ-యాక్టివేటెడ్ సిమ్ కార్డుల రవాణా. మార్చి 31న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వ్యక్తి వద్ద 198 సిమ్ కార్డులు పట్టుబడ్డాయి. 2023 నుంచి ఇలాంటి 600కి పైగా సిమ్‌లు విదేశాలకు తరలించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వీటి ద్వారా విదేశాల్లో నుంచే భారత నంబర్లతో కాల్స్ చేసి మోసాలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
యువతను సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ఆకర్షిస్తున్న గ్యాంగులు డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపిస్తున్నాయి. అక్కడికి వెళ్లిన తర్వాత బలవంతంగా మోసాల్లో పాల్గొనాల్సి వస్తోందని దర్యాప్తులో బయటపడింది. కొందరు తిరిగి వచ్చినా, వేల సంఖ్యలో ఇంకా అక్కడే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
కాంబోడియా కోరల్లో భారతీయులు
ఇటీవల సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తిని సిహానూక్‌విల్లేలోని కాల్ సెంటర్ నుంచి రక్షించిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కుటుంబానికి పంపిన సందేశంతో ఈ విషయం బయటపడింది. ఇక బెలగావిలో నమోదైన ఒక కేసులో, డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా ఓ వృద్ధుడి నుంచి రూ.15.4 కోట్లు మోసం చేసిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఈ కేసు ఛేదించినట్లు తెలిసింది.
ఇప్పటివరకు భారత్ ప్రభుత్వం కాంబోడియాలో చిక్కుకున్న 250 మందిని రక్షించినట్లు సమాచారం. వేలాది మంది ఇంకా అక్కడే బలవంతపు సైబర్ కార్యకలాపాల్లో ఉన్నారనే నివేదికలు ఆందోళన పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కాంబోడియా అధికారులతో కలిసి చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. రోజుకు పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సమాచారం. మొత్తంగా, సైబర్ మోసాల వెనుక అంతర్జాతీయ నెట్వర్క్ విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపై దర్యాప్తు సంస్థలు మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా కసరత్తు చేస్తున్నాయి.

