రేవంత్ ను తట్టుకుని కేటీఆర్ నిలబడగలరా ?
x
Revanth and KTR

రేవంత్ ను తట్టుకుని కేటీఆర్ నిలబడగలరా ?

117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోంది


తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందా ? కొత్త ఏడాది జనవరి చివరిలో కాని ఫిబ్రవరిలో కాని మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోంది. ఓటర్ల జాబితా తుది నోటిఫికేషన్ జారీకి జనవరి 10 ఆఖరుతేదీగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. 2020లో జరిగిన ఎన్నికల్లో 120 మున్సిపాలిటీల్లో (BRS)బీఆర్ఎస్ 100 చోట్ల గెలిచింది. అలాగే మొత్తం తొమ్మిది కార్పొరేషన్లలో ఏడుచోట్ల గెలిచింది. ఇపుడు (GHMC)గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగటంలేదు. వీటి కాలపరిమితి మరో రెండు నెలల తర్వాత ముగుస్తాయి.

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణలో భాగంగా గ్రేటర్ శివార్లలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం విలీనంచేసింది. అందుకని మున్సిపాలిటీల సంఖ్య కూడా తగ్గింది. ఇపుడు విషయం ఏమిటంటే మొన్ననే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని కూడా ప్రకటిస్తున్నారు. నిజానికి 12,733 పంచాయతీల్లో కాంగ్రెస్ 7010, బీఆర్ఎస్ 3502 పంచాయతీలను గెలిచింది. కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన పంచాయతీల్లో సగం పంచాయతీల్లో మాత్రమే బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. అయినా కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు, సవాళ్ళు విచిత్రంగా ఉంటున్నాయి. తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించాలని కాంగ్రెస్ కు కేసీఆర్ పార్టీసమావేశంలో సవాలు విసిరారు. మెజారిటి మున్సిపాలిటీలను గెలుచుకోవాలని రేవంత్ ఇప్పటికే మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలకు హెచ్చరికలు చేశారు.

బీఆర్ఎస్ అగ్రనేతలే ప్రకటనలతో ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. రేవంత్, మంత్రులను పదేపదే రెచ్చగొట్టారు, ఇపుడు కూడా రెచ్చగొడుతున్నారు. ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో 50శాతంకు పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారని, జనాల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని, మున్సిపల్ ఎన్నికలతో రేవంత్ ప్రభుత్వం కథ ముగుస్తుందనే అనవసరమైన ప్రకటనలతో కాంగ్రెస్ ను రెచ్చగొడుతున్నారు. పంచాయితీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా ప్రభుత్వానికి వచ్చే ఢోకా అయితే ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు జరిగేది 2028లో మాత్రమే. అప్పటివరకు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోనే కూర్చోవాలన్న ఆలోచనను కేటీఆర్, హరీష్ మరచిపోయినట్లున్నారు.


రేవంత్ ను రెచ్చగొడుతున్నారా ?

లోకల్ ఎలక్షన్స్ లో అధికారపార్టీ ఓడినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్షణనష్టం ఏమీలేదు. ఈ విషయం తెలిసికూడా అనవసరంగా కేటీఆర్, హరీష్ సవాళ్ళువిసిరి రేవంత్, మంత్రులను బాగా రెచ్చగొడుతున్నారు. ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ముందు కూడా కేటీఆర్ ఇలాగే మాట్లాడి అబాసుపాలయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేవంత్ ప్రభుత్వానికి రెఫరండం అని ప్రకటించారు. తమ అభ్యర్ధి మాగంటి సునీత గెలుపు ఖాయమన్నారు. తీరాచూస్తే కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. నవీన్ గెలుపుతో కేటీఆర్ చెప్పినట్లుగా జనాల మద్దతు కాంగ్రెస్ కు ఉన్నదని అర్ధమవుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన రెఫరెండం మాటను ఫలితం వచ్చిన తర్వాత కేటీఆర్ ఎక్కడా మాట్లాడలేదు. అలాగే పంచాయతీల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా కేటీఆర్ నోరుపారేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే.

ఇలాంటి పరిస్ధితుల్లో జనవరి చివర లేదా ఫిబ్రవరిలో జరుగుతాయని అనుకుంటున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతోంది అన్నది ఇంట్రెస్టింగుగా తయారైంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లాగ కాకుండా మున్సిపల్ ఎన్నికలు పార్టీ బ్యానర్ మీదే జరుగుతాయి. కాబట్టి గెలిచిన అభ్యర్ధుల పార్టీకే జనాల్లో మద్దతున్నట్లు తేలిపోతుంది. ఈ విషయం తెలుసుకాబట్టి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతలను రేవంత్ పదేపదే హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయాల్సిందే అని పదేపదే హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలపరిమితి ఇంకా మూడేళ్ళుంది కాబట్టి రేవంత్ మాటను మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు తీసిపారేసేందుకు లేదు. ఎన్నికల్లో పార్టీఅభ్యర్ధుల గెలుపోటములకు మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులనే రేవంత్ బాధ్యులను చేయటం గ్యారెంటి.

టఫ్ ఫైట్ గ్యారెంటీనా ?

ఈ నేపధ్యంలో స్వీప్ చేయటం సాధ్యంకాకపోయినా మెజారిటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకునేందుకు అధికారపార్టీ సర్వశక్తులను ఒడ్డుతుంది. మరీ పరిస్ధితుల్లో బీఆర్ఎస్ ఏమిచేయబోతోంది ? అన్నది ఆసక్తిగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని గ్యారెంటీలేదు. మొన్నటి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలు, తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను, పార్టీ మద్దతుదారులను గెలిపించమని కేసీఆర్ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. జూబ్లీ ఉపఎన్నికలో కేసీఆర్ ప్రచారంచేస్తారని ప్రచారంచేసుకన్నారు కాని ఫామ్ హౌస్ దాటి అడుగు బయటపెట్టలేదు.

కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కేసీఆర్ ప్రచారం చేస్తారని ఎవరు అనుకోవటంలేదు. పార్టీ నడుస్తున్నది కేసీఆర్ ఇమేజీ మీదే కానీ కేటీఆర్, హరీష్ ఇమేజి మీద కాదని అందరికీ తెలుసు. అధినేత కేసీఆరే పార్టీ గెలుపుకోసం ప్రచారం చేయకపోతే గెలుపు విషయంలో లోకల్ నేతలకు ఏమంతా ఆసక్తి ఉంటుంది ? వివిధ జిల్లాల్లోని నేతల మధ్య సరైన సమన్వయంలేదని పార్టీ సమీక్షల్లో బయటపడింది. పార్టీలోని సీనియర్లలో కొందరు కేటీఆర్ మద్దతుగాను, మరికొందరు హరీష్ కు మద్దతుగా విడిపోయారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

అధికారంలో ఉంటేనే పులా ?

బీఆర్ఎస్ పరిస్ధితి ఎలాగ తయారైందంటే అధికారంలో ఉంటేమాత్రమే పులిలాగ తయారైంది. అధికారంలో ఉన్నపుడు జరిగిన అన్నీ ఎన్నికల్లో మెజారిటి గెలుచుకున్నది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటులో కూడా గెలవలేదు. రెండు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓడింది. మూడు ఎంఎల్సీల ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. పంచాయతీ ఎన్నికల్లో 3500 పంచాయతీల్లో మద్దతుదారులు గెలిచారంతే. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి వ్యూహాలను తట్టుకుని కేటీఆర్ ఎత్తుకు పై ఎత్తులు వేయగలరా ? బీఆర్ఎస్ ను గెలిపిస్తారా అన్నది ఆసక్తిగా మారుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story