తెలంగాణలో క్యాన్సర్ మ్యాపింగ్
x

తెలంగాణలో క్యాన్సర్ మ్యాపింగ్

క్యాన్సర్ రోగాన్ని నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించాలని, హైదరాబాద్ లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో రిజిస్ట్రీని మెయిన్ టైన్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.


నానాటికి పెరిగిపోతున్న క్యాన్సర్ మహమ్మారి విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే క్యాన్సర్ రోగాన్ని నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించాలని, క్యాన్సర్ రోగానికి సంబంధించి హైదరాబాద్ లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో రిజిస్ట్రీని మెయిన్ టైన్ చేయాలని. ఈరెండు చర్యలవల్ల రాష్ట్రంలో క్యాన్సర్ రోగానికి సంబంధించిన సమస్త సమాచారం ఇకనుండి రికార్డవుతుంది. అంటే క్యాన్సర్ ఏ జిల్లాలో ఎక్కువగా సోకుతున్నది, ఏ వయసుల వారికి సోకుతున్నది, ఏ కారణంతో వస్తున్నది, రోగుల సంఖ్య, చేయించుకుంటున్న చికిత్సలు, ఎంతమంది మరణించారు ? ఎంతమందికి నయమైంది ? లాంటి అనేక వివరాలు ఇకనుండి ప్రభుత్వం దగ్గర కచ్చితంగా రికార్డవుతాయి. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే క్యాన్సర్ రోగానికి సంబంధించిన పరిశోధనలు, విశ్లేషణలు, వైద్యం తదితర అంశాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతాయి.

ఇప్పటివరకు తెలంగాణలో క్యాన్సర్ రోగానికి ఎంతమంది చికిత్సలు చేయించుకుంటున్నారు, ఎంతమంది మృత్యువాతపడ్డారు, ఎంతమందికి నయమైంది అన్న వివరాలు ప్రభుత్వం దగ్గరలేవు. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు కలిపి 33 జిల్లాల్లోను క్యాన్సర్ రోగానికి చికిత్సలు చేస్తున్న ఆసుపత్రులు చాలానే ఉన్నాయి. అయితే ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఎంతమంది రోగులు చికిత్సలు చేయించుకుంటున్నారనే వివరాలు ప్రభుత్వం దగ్గర లేవు. మారుతున్న జనాల జీవనశైలి, ఒత్తిళ్ళు, జంక్ ఫుడ్ తినటం ఎక్కువైపోతుండటం, వాతావరణ, నీటి కాలుష్యంలాంటి అనేక కారణాలతో రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

పెరిగిపోతున్న క్యాన్సర్ రోగానికి సంబంధించిన వివరాలేవీ ప్రభుత్వం దగ్గర లేవు. రేపు క్యాన్సర్ రోగానికి సంబంధించి పరిశోధనలు చేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా ప్రభుత్వం దగ్గర ఇప్పటివరకు వివరాలు లేకపోవటం ఆశ్చర్యమనే చెప్పాలి. అందుకనే పెరిగిపోతున్న క్యాన్సర్ కు సంబంధించిన అన్నీ వివరాలను మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీనికోసం ప్రత్యేకంగా రిజిస్ట్రీని మొదలుపెట్టబోతోంది. లక్డీకాపూల్ లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలోనే రిజిస్ట్రీని ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల తెలంగాణలో క్యాన్సర్ రోగుల వివరాలు, ఎన్ని రకాల క్యాన్సర్లు సోకుతున్నాయి, జరుగుతున్న చికిత్సలు, ఏ ప్రాంతంలో ఎక్కువ క్యాన్సర్లు సోకుతున్నాయనే వివరాలు క్రమం తప్పకుండా రిజిస్ట్రీకి చేరబోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పటివరకు జరుగుతున్న క్యాన్సర్ రోగుల వివరాలు, చికిత్సల వివరాలను కూడా రిజిస్ట్రీకి ఆసుపత్రులు బదిలీ చేయాల్సుంటుంది.

పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు

అందుబాటులోని సమాచారం ప్రకారం ప్రతిఏడాది తెలంగాణలో సగటున సుమారు 54 వేల కేసులు నమోదవుతున్నాయి. గడచిన 10 ఏళ్ళల్లో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయనే చెప్పాలి. 2015లో 40 వేల కేసులు నమోదైతే, 2020లో 47,620 కేసులు నమోదయ్యాయి. 2023లో 51,145 కేసులు నమోదవ్వగా, 2024లో 52,334 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2025లో సుమారు 55వేల కేసులు నమోదైనట్లు సమాచారం. రాష్ట్రం మొత్తంమీద క్యాన్సర్ కేసులు ఎక్కువగా హైదరాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. తర్వాత రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, నల్గొండ జిల్లాల్లో నమోదవుతున్నాయి. 33 జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ క్యాన్సర్ రోగాలు నమోదవ్వటానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే వేగంగా మారిపోతున్న జనాల జీవనశైలి. నగరంలోని జనాలు ఎక్కువగా వాతావరణ కాలుష్యానికి గురవుతుండటం, డ్రింక్స్, సిగిరెట్లు విపరీతంగా తీసుకుంటుండటం, ఉద్యోగాల కారణంగా రాత్రుళ్ళు మేల్కొన్నపుడు అర్ధరాత్రుళ్ళు లేదా తెల్లవారిజామున మసాలలతో కూడిన భోజనాలు ఎక్కువగా తింటుండటం, నిద్రలేమి, టెన్షన్లు ఎక్కువైపోతున్న నేపధ్యంలో క్యాన్సర్ రోగానికి హైదరాబాదులోని జనాలే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు.

కాలుష్యం, జీవనశైలే ప్రధాన కారణం

పరిశ్రమల కాలుష్యం, నీటికాలుష్యం లాంటి అనేక కారణాలు పెరిగిపోతు క్యాన్సర్ సోకటానికి దోహదపడుతున్నాయి. నగరంలోని జీడిమెట్ల, బాలాపూర్, బాచుపల్లి లాంటి అనేక ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యానికి తోడు పరిశ్రమల వ్యర్ధాలు కూడా ఎక్కువైపోతున్నాయి. పరిశ్రమల నుండి విడుదల అవుతున్న రశాయనాల పొగలను చుట్టుపక్కల జనాలు 24 గంటలూ పీల్చుతునే ఉంటారు. అలాగే కొన్ని పరిశ్రమల్లోని వ్యర్ధాలు చుట్టుపక్కల చెరువులు, కాల్వల్లోకి చేరుతున్నాయి. ఇవే నీటిని తాగటంవల్ల కూడా జనాలకు క్యాన్సర్ సోకుతున్నది. మూసీనది ప్రక్షాళనపై ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య ఎంతపెద్ద వివాదం జరుగుతున్నదో అందరు చూస్తున్నదే.

నగరంలో మొదలైన మూసీనది సుమారు 7 నియోజకవర్గాల గుండా ప్రవహించి నల్గొండ జిల్లాలో కలుస్తున్నది. నగరంలోని 7 నియోజకవర్గాల పరిధిలోని నీటిని జనాలు తాగటమే కాకుండా ఆ నీటితోనే పండించిన వరి, కూరగాయలు, ఆకుకూరలను తింటున్నారు. మూసీనదిలో నీరంటేనే సకల రోగాలకు నిలయమన్న విషయం అందరికీ తెలిసిందే. పండిస్తున్న వరి, కూరగాయలు, ఆకుకూరలను మూసీనీటితో పండిస్తున్నట్లు పండించిన వారు, అమ్ముతున్న వారు చెప్పరు. బయట ఎక్కడినుండో తీసుకువస్తున్నట్లు వ్యాపారులు చెప్పడంతో జనాలు కొనేసి వాడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ రోగం ఎక్కువగా సోకుతున్నది.

సమస్త సమాచారం దొరకుతుంది : సంధ్యారాణి

ఇదే విషయమై ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలోని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిప్పాని సంధ్యారాణి మాట్లాడుతు క్యాన్సర్ రోగాన్ని నోటిఫైడ్ డిసీజ్ గాను, రిజిస్ట్రీని మెయిన్ టైన్ చేయటం చాలామంచిదన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించి, రిజిస్ట్రీని ఏర్పాటుచేయటం వల్ల రాష్ట్రంలోని క్యాన్సర్ రోగానికి సంబంధించిన సమస్త సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది’’ అనిచెప్పారు. ‘‘సెక్స్ వర్కర్లు, గుట్కాని ఎక్కువగా వాడుతున్న వారిలో క్యాన్సర్ ఎక్కువగా సోకుతున్నది’’ అని తెలిపారు. ‘‘తమ ఆసుపత్రిలో మాత్రమే ఏడాదికి 10 వేల క్యాన్సర్ రోగులు రిజిస్టర్ అవుతున్నారు’’ అని చెప్పారు. ‘‘రిజిస్ట్రీని ఏర్పాటుచేయటం వల్ల క్యాన్సర్ రోగంపై పరిశోధనలు, రోగం సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవటానికి, స్క్రీనింగ్ టెస్టులు చేయటానికి, ఫాలోఅప్ తదితరాలకు చాలా ఉపయోగపడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు.

‘‘జీవనశైలిలో జరుగుతున్న మార్పులు, ఒబెసిటీ, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, ఆడవాళ్ళలో వివాహాలు ఆలస్యంగా జరుగుతుండటం, బ్రెస్ట్ ఫీడింగ్ లాంటి అనేక కారణాలతో మౌత్, లంగ్, స్టమక్, బ్రెస్ట్ క్యాన్సర్లు సోకుతున్నాయి’’ అని డాక్టర్ ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రభుత్వానిది మంచి నిర్ణయం : జాకీర్ హుస్సేన్

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్ మహ్మద్ జకీర్ హుస్సేన్ మాట్లాడుతు ‘‘తమ ఆసుపత్రిలో ప్రతిరోజు కనీసం వెయ్యిమంది క్యాన్సర్ రోగులు రిజిస్టర్ అవుతున్నారు’’ అని చెప్పారు. ‘‘తమ ఆసుపత్రికి వచ్చే రోజుల్లో ఎక్కువమంది థర్డ్ స్టేజికి చేరుకున్న రోగులే వస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘క్యాన్సర్ రోగాన్ని నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించి, రిజిస్ట్రీని ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చాలామంచిది’’ అని తెలిపారు. ‘‘దీనివల్ల రాష్ట్రంలో ఏ ప్రాంతంలో క్యాన్సర్ ఎక్కువగా సోకుతున్నది ? చేయాల్సిన పరిశోధనలు, రోగాలను శాస్త్రీయంగా విశ్లేషించటం, స్క్రీనింగ్ పరీక్షలు చేయించటం లాంటి చర్యలు తీసుకోవటం ప్రభుత్వానికి వీలవుతుంది’’ అన్నారు.

Read More
Next Story