తెలంగాణలో వీధి కుక్కల హత్యల కేసులు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి
x
సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ వీధి కుక్కల పంచాయితీ

తెలంగాణలో వీధి కుక్కల హత్యల కేసులు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి

జంతు క్రూరత్వం వర్సెస్ ప్రజా భద్రత: తెలంగాణ కేసులు సుప్రీంకోర్టులో


తెలంగాణలో వీధి కుక్కల సమస్య ఇప్పుడు కోర్టు గడపకు ఎక్కింది. కుక్కల కాటు ఘటనలు పెరుగుతున్న వేళ, పలు గ్రామాల్లో వందల సంఖ్యలో వీధి కుక్కలను అమానుషంగా చంపిన ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలపై నమోదైన కేసులు చివరకు సుప్రీంకోర్టు వరకు చేరడంతో, ప్రజా భద్రత–జంతు హక్కుల మధ్య పోరాటం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.

- గ్రామాల్లో కుక్కల బెడదపై ఇచ్చిన ఎన్నికల హామీలు… వాటి అమలులో తీసుకున్న తీవ్రమైన నిర్ణయాలు… ఇప్పుడు ఇవే తెలంగాణను న్యాయపోరాటంలోకి నెట్టాయి. వీధి కుక్కల నియంత్రణ పేరుతో సాగిన హత్యలపై దాఖలైన కేసులు సుప్రీంకోర్టుకు చేరడంతో, పంచాయతీలు–ప్రభుత్వం–జంతు ప్రేమికుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో కుక్కలను చంపిన కేసు దర్యాప్తు సుప్రీంకోర్టుకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని నందిగామ మండలంలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ సమీపంలో 40 వీధికుక్కలను చంపారనే కేసులో దర్యాప్తు చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్)ను న్యాయవాది వి రిషిహాస్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయగా, దీన్ని హైకోర్టు సుప్రీంకోర్టుకు బదలాయించింది. కుక్కలను హతమార్చిన కేసులో నిందితులుగా నందిగామ తహసీల్దారు, మొదల్లగూడ గ్రామ సర్పంచ్, యూనివర్శిటీ నిర్వాహకులు, అధికారులున్నారని పిల్ లో ఆరోపించారు. వీధి కుక్కల అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నందున ఈ పిల్ ను సుప్రీంకు బదలాయిస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ లు ప్రకటించారు.

మాజీమంత్రి మనేకాగాంధీ జోక్యం
రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో వీధి కుక్కల బెడద పెరగడంతో 100 కుక్కలను పట్టుకెళ్లి చంపారని వీధి శునకాల సంరక్షణ సంస్థ ప్రతినిధి మౌనికతో అయిదుగురు సభ్యులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతుప్రేమికురాలైన మనేకాగాంధీ జోక్యం చేసుకొని కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో యాచారం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. యాచారం గ్రామ పంచాయతీ పాలకవర్గం కుక్కలు పట్టేవారిని పిలిచి ఓ కర్రకు సూది కట్టి కుక్కలకు గుచ్చారు. వీధి కుక్కలు స్పృహ కోల్పోగానే గొయ్యి తవ్వి పూడ్చి పెట్టారని వీధి కుక్కల సంరక్షణ సంస్థ ఫిర్యాదుపై పోలీసులు యాచారం గ్రామ కార్యదర్శి వార్డు సభ్యులపై కేసు నమోదు చేశారు.

37 వీధి కుక్కల కళేబరాలు లభ్యం
యాచారం గ్రామ శివార్లలోని గుట్టల మధ్యలో తవ్వగా 37 వీధి కుక్కల కళేబరాలు బయటపడ్డాయి. కుక్కల కళేబరాలకు పోస్టుమార్టం చేసి వాటిని పూడ్చిపెట్టామని పోలీసులు చెప్పారు. కళేబరాల నుంచి సేకరించిన శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వీధి కుక్కల కళేబరాలు వెలుగుచూసిన నేపథ్యంలో వీటిని చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మనేకాగాంధీ డిమాండ్ చేశారు.



వరంగల్ ఎన్‌ఐటిలో...

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి)లో కుక్కల పట్ల క్రూరంగా ప్రవర్తించారని జంతు హక్కుల కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టిట్యూట్ చీఫ్ వార్డెన్ అబ్దుల్ అజీమ్, క్యాంపస్ కుక్కలను పట్టుకునే బృందం పలు వీధి కుక్కలను తొలగించేందుకు బలాన్ని ప్రదర్శించారని జంతు హక్కుల కార్యకర్త అడులపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. తీగల సాయంతో కుక్కలను లాక్కెళ్లారని, కుక్కలను వాహనంలో ఆహారం లేకుండా ఉంచి వాటిని ఇతర ప్రాంతాల్లో వదిలివేసేందుకు యత్నించారని గౌతం ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్కలను తిరిగి ఎన్ఐటీ క్యాంపస్ లోనే వదిలిపెట్టాలని సబ్-ఇన్‌స్పెక్టర్ వి లావన్ కుమార్ కోరారు.

జంతువులపై ఇంత క్రూరత్వమా?
హన్మకొండ జిల్లా శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో 300 వీధి కుక్కలను చంపారని జంతుప్రేమికుడు గౌతం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీధికుక్కలను చంపిన 9 మందిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. జంతువులను చంపడం, విషం పెట్టడం, గాయపర్చడం జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం సెక్షన్11, బీఎన్ఎస్ సెక్షన్ 325 కింద కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

వీధి కుక్కల పంచాయితీ...
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో గత నెలలో 40కుక్కలను మున్సిపల్ కార్మికులు చంపినట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాము పిల్లల్ని కరుస్తున్న పిచ్చి కుక్కలను మాత్రమే చంపించామని పంచాయతీ గ్రామాల సర్పంచులు చెబుతుండగా, విషపూరితమైన ఇంజెక్షన్లు ఇచ్చి వీధికుక్కలను అమానుషంగా చంపి జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించారని జంతు సంరక్షణ కార్యకర్త గౌతం ఆరోపించారు. ఈ వీధికుక్కలను చంపిన ఘటనల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణలోని పలు గ్రామాల్లో సాగిన వీధి కుక్కలను చంపిన ఘటనలపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద తెలంగాణలో వీధి కుక్కల పంచాయితీ సుప్రీంకు చేరడంతోపాటు ఈ అంశం వివాదాస్పదంగా మారింది.

కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పరిధిలోని భవానీపేట, పాల్వంచ, ఫరీద్ పేట్, వాడి, బండ రామేశ్వరం పల్లి గ్రామాల్లో కుక్కలను చంపారని స్ట్రే యనిమనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మేనేజరు ఎ గౌతం పోలీసులకు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. ఈ కేసులో 244 వీధి కుక్కలను చంపి పూడ్చారని తేలిందని, దీనిపై పోస్టుమార్టం చేయించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపించామని మాచారెడ్డి పోలీసులు చెప్పారు.

సర్కారుకు హైకోర్టు ఆదేశాలు
మరో వైపు తెలంగాణలో రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 2019వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు పదవీకాలం ముగిసినా కొత్త బోర్డు ఏర్పాటు చేయలేదని హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా అనే సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. రాష్ట్రంలో పెంపుడు జంతువుల దుకాణాలు, శునకాల పెంపకం కేంద్రాలను చట్టప్రకారం నిర్వహించుకునేందుకు వీలుగా జంతు సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఎవరి వాదన వారిదే...
సినీనటీమణులు రేణుదేశాయ్, రష్మీ గౌతంలు వీధి కుక్కలను సంరక్షించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల విలేఖరుల సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో కుక్కల కాటు ఘటనలు ఒకవైపు, మరో వైపు కుక్కలను చంపుతున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. దీనిపై అత్యున్నత సుప్రీంకోర్టు దర్యాప్తు చేయనున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ ఘటనలపై అధికారులు, జంతుప్రేమికులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో కుక్కల బెడద నివారణపై హామీలు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కుక్కల బెడదను ప్రధానాంశంగా అభ్యర్థుల ముందు ప్రస్థావించారు. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచులుగా ఎన్నికైన వారు తాము గ్రామంలో కుక్కల బెడద సమస్యను పరిష్కరిస్తామని హామీలిచ్చారు. ఎన్నికల హామీల మేరకు వీధికుక్కలను పట్టుకొని చంపి వాటిని పూడ్చిపెడుతుండటంతో జంతుప్రేమికులు కేసులు పెడతున్నారు. ఒక వైపు వీధి కుక్కల బెడద, మరో వైపు పంచాయతీల చర్యలు, ఇంకో వైపు జంతుప్రేమికుల కేసులతో తెలంగాణలో కుక్కల పంచాయితీలు పెరిగాయి.

తెలంగాణలో పెరుగుతున్న కుక్కకాటు ఘటనలు
తెలంగాణ రాష్ట్రంలో కుక్క కాటు ఘటనల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో 2022వ సంవత్సరంలో 92,924 కుక్కకాటు ఘటనలు నమోదు కాగా 2023లో వీటి సంఖ్య 1,19,014కు పెరిగాయి. 2024లో కుక్కకాటు ఘటనలు 1,21,997 కు పెరిగాయి. దీంతోపాటు రేబిస్ వ్యాధి సోకి మరణాలు కూడా సంభవించాయి.

వీధి కుక్కల్ని చంపిన వారిపై చర్యలు : మంత్రి ధనసరి సీతక్క
రాష్ట్రంలో వీధి కుక్కల్ని చంపిన వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. వీధికుక్కలపై విషప్రయోగం చేసి చంపడం అమానుషమని మంత్రి పేర్కొన్నారు. వీధి కుక్కల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టీకాలు, సంతానోత్పత్తి నియంత్రణ పద్ధతులను పాటించాలని మంత్రి సూచించారు. కొన్ని గ్రామాల్లో వీధికుక్కలు ఎక్కువగా ఉన్నాయని చంపడం తగదని ఆమె సూచించారు.

సుప్రీం తుది తీర్పు కోసం ఎదురుచూపులు
మొత్తంగా చూస్తే తెలంగాణలో వీధి కుక్కల నియంత్రణ పేరుతో చోటుచేసుకున్న ఘటనలు ఇప్పుడు న్యాయపరమైన మలుపు తిరిగాయి. ప్రజా భద్రత అవసరం ఒకవైపు, జంతు హక్కులు మరోవైపు నిలిచిన ఈ వివాదంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా వీధి కుక్కల విధానానికి దిశానిర్దేశం చేయనుంది.
వీధి కుక్కల బెడదకు తక్షణ పరిష్కారాలు వెతుకుతున్న వేళ, చట్టాన్ని అతిక్రమించి తీసుకున్న చర్యలు మరిన్ని సమస్యలకు దారి తీస్తున్నాయి. శాస్త్రీయ నియంత్రణ, టీకాలు, సంతాన నియంత్రణే దీర్ఘకాలిక పరిష్కారం అని నిపుణులు చెబుతుండగా, ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయమే తెలంగాణలో ఈ సమస్య భవిష్యత్తును నిర్ణయించనుంది.


Read More
Next Story