
కందనకుంటలో కుల బహిష్కరణ… పాడె మోసేందకు రాని గ్రామస్థులు
జగిత్యాల జిల్లా కందనకుంటలో కుల బహిష్కరణ ఘటన. ఎదుల రాజేశం అంత్యక్రియల్లో గ్రామస్తులు దూరంగా ఉండగా, కుటుంబమే పాడె మోయాల్సి వచ్చింది.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి అనంతరం, అతని పాడెను కుటుంబసభ్యులే మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముందుగా గ్రామ పెద్దలు ఎదుల రాజేశం కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత రాజేశం మృతి చెందగా, అతని పాడె మోయకూడదని గ్రామ సర్పంచ్‌తో పాటు కుల పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు మాత్రమే కాదు, దూరపు బంధువులు కూడా అంత్యక్రియలకు ముందుకు రాలేదు.
అంత్యక్రియలు సజావుగా సాగాలంటూ కుటుంబ సభ్యులు వేడుకున్నా, సర్పంచ్ మరియు పెద్దలు స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో చేసేదేమీ లేక రాజేశం మృతదేహాన్ని అతని భార్య, అక్కలు, సొంత కుటుంబసభ్యులే పాడెపై మోసి అంత్యక్రియలు నిర్వహించారు.
కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనవద్దని గ్రామస్థులను ఆదేశించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ అమానవీయ పరిణామం కందనకుంట గ్రామంలో వెలుగుచూసింది. ఈ ఘటనపై వివిధ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు స్పందిస్తారనే ఆశతో స్థానికులు ఎదురుచూస్తున్నారు.

