
కవిత ఇంట్లో సీబీఐ అధికారులు
దాదాపు గంటసేపు ఆమె నివాసంలోనే ఉన్న అధికారులు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. దాదాపు గంటసేపు ఆమె నివాసంలోనే ఉన్న అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన నోటీసులను ఆమెకు అందించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలమేరకు ఆమెకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడం కోసం సీబీఐ అధికారులు వచ్చారు. అంతేకాకుండా నోటీసులు తనకు అందినట్లు కవిత నుంచి ధృవీకార సంతకం కూడా తీసుకున్నారు. సీబీఐ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కే కవిత సహా 23 మందికి స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ తీర్పుతో కేసులో ఉన్న ఆరోపణలు నిలబడవని ట్రయల్ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సీబీఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. సోమవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
లిక్కర్ పాలసీ కేసులో కీలక పాత్రలు ఉన్న వ్యక్తులపై స్పెషల్ కోర్టు సరైన విధంగా పరిశీలన చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రలను అంచనా వేయడంలో ట్రయల్ కోర్టు పొరపాట్లు చేసిందని పేర్కొన్నారు. మద్యం పాలసీ వెనుక పెద్ద కుట్ర ఉందని సీబీఐ వాదించింది. కానీ ట్రయల్ కోర్టు మొత్తం వ్యవహారాన్ని విడివిడిగా చూసి నిర్ణయం తీసుకోవడం వల్ల కేసు బలహీనపడిందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అందువల్ల ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోర్టును కోరింది. ఈ వాదనలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది. అలాగే ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఈడీ కేసులో ట్రయల్‌ను కూడా వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశించింది. ఈ సందర్భంగా కవిత అంశం మరోసారి చర్చకు వచ్చింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆమె పాత్రపై సీబీఐ ప్రత్యేకంగా విచారణ జరిపిందని కోర్టులో ప్రస్తావించింది. ఈ క్రమంలోనే తాజాగా కవితకు మరోసారి నోటీసులు అందాయి.

