కేంద్రం ఆధార్ కార్డులను డీలింక్ చేస్తోందా?
x

కేంద్రం ఆధార్ కార్డులను డీలింక్ చేస్తోందా?

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పినట్టు కేంద్రం ఆధార్ కార్డులను డీ లింక్ చేస్తోందా? ఇలా చేయడాన్ని ఆమె రాజకీయ కుట్రగా భావిస్తున్నారా?


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను లబ్దిదారులు పొందకూడదని ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా తమ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత తీసుకువచ్చి, రానున్న లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు.

బీర్‌భూమ్ జిల్లాలో జరిగిన ప్రజా పంపిణీ కార్యక్రమంలో మమతా మాట్లాడారు. ఆధార్ కార్డ్ లేకపోయినా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను జనం వద్దకు చేరుస్తామని చెప్పుకొచ్చారు.

"జాగ్రత్తగా ఉండండి, వారు (బిజెపి నేతృత్వంలోని కేంద్రం) ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తున్నారు. రాష్ర్టంలోని అనేక జిల్లాల్లో ఇప్పటికే ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. ఆధార్ కార్డులను డీలింక్ చేయడం వల్ల ప్రజలు ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేరు.

ఆధార్ కార్డు లేకపోయినా పథకాలను వర్తింపజేస్తా. ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగదు’’ అని హామీ ఇచ్చారు.

బెంగాల్‌లోని రైతులకు ఎటువంటి సమస్య లేదని చెప్పినా టీఎంసీ చీఫ్.. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న హర్యానా, పంజాబ్‌ రైతులకు మద్దతు తెలిపారు. "రైతుల నిరసనకు సెల్యూట్ చేస్తున్నా. వారిపై దాడులను ఖండిస్తున్నా" అని పేర్కొన్నారు.

Read More
Next Story