
పసుపు బోర్డుకు మరోసారి పైసా ఇవ్వని కేంద్ర బడ్జెట్
పోయిన ఏడు సంక్రాంతి కానుకగా వచ్చిన బోర్డుకు ఈ సారైనా తగిన నిధులు వస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది
రాజకీయ ప్రకంపనలు సృష్టించి దేశం దృష్టిని ఆకర్షించిన పసుపు బోర్డు మంజూరైనా రైతులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. రాజకీయంగా కవితకు నష్టం చేసి బీజేపీ కి ఉత్తర తెలంగాణలో లబ్ది చేసిన ఈ అంశం పట్ల ఆ పార్టీ తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు లేదు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి పసుపు బోర్డుకు మొండి చేయి చూపింది. గత సంవత్సర బడ్జెట్ లో బీహార్ లో మకనా బోర్డుకు రు. వంద కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు పైసా ఇవ్వలేదు.
జనవరి 14, 2025 వ తేదీన నిజామాబాద్ కేంద్రంగా బోర్డు ఏర్పడిన తరువాత కేంద్రం రెండు బడ్జెట్ లను ప్రవేశపెట్టింది. ఈ ఏడు అయినా తమ ఆశలు నెరవేరుతాయని ఎదురు చూసిన రైతులకు నిరాశే ఎదురైంది. నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటును సంక్రాంతి కానుకగా పేర్కొంటూ దీని వలన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పసుపు పంట ఉత్పత్తిని పెంచటానికి అవకాశం ఏర్పడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష గోయల్ ఆ సందర్భంగా ఆశాభావం వ్యక్తంచేశారు.
బోర్డుకు మొదటి చైర్ పర్సన్ గా బీజేపీ నాయకుడు పల్లె గంగా రెడ్డిని నియమించారు.
పసుపు లో మన వాటా:
ప్రపంచంలోని 80 శాతం పసుపు పంటను మన దేశం పండిస్తుంది. మన తరువాత చైనా (8 శాతం), మయన్మార్ (4 శాతం), నైజీరియా (3 శాతం), బంగ్లాదేశ్ (3 శాతం) వాటా కలిగి ఉన్నాయి. ఇది దేశంలో 20 రాష్ట్రాలలో పండుతుంది. 2024-25 లో 2.19 లక్షల ఎకరాలలో 3.34 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి చేసి మహారాష్ట్ర ముందు వరసలో ఉంది. ఒరిస్సా 0.75 లక్షల ఎకరాలు లో 0.60 లక్షల టన్నుల పంటతో రెండవ స్థానంలో నిలిచింది. తమిళనాడు 0.58 లక్షల ఎకరాలు, మధ్య ప్రదేశ్ 0.65 లక్షల హెక్టార్లు, పశ్చిమ బెంగాల్ 0.49 లక్షల ఎకరాల్లో పండించగా తెలంగాణ 0.16 లక్షల ఎకరాల్లో పంట పండించింది.
2023-24 లో దేశం 8.6 లక్షల ఎకరాల్లో 10.74 లక్షల టన్నుల పసుపు పండించింది. ఉత్పత్తి. దేశంలో దాదాపు 30 రకాల పసుపు పండుతోంది. రాష్ట్రంలో ప్రధాన పసుపు పండించే జిల్లాలు నిజామాబాద్ (22,941 ఎకరాలు), జగిత్యాల (9714 ఎకరాలు), నిర్మల్ (5542 ఎకరాలు), వికారాబాద్ (1,555 ఎకరాలు), వరంగల్ (841 ఎకరాలు), మహబూబాబాద్ (369 ఎకరాలు).
2024-25 లో దేశం 1.37 లక్షల టన్నుల పసుపును ఎగుమతి చేసింది. దీన్ని ప్రధానంగా దిగుమతి చేసుకునే దేశాలు బంగ్లాదేశ్ (26,285 టన్నులు), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) (22,062 టన్నులు), మలేషియా (6,419 టన్నులు), అమెరికా (6,689 టన్నులు), మొరాక్కో (6,288 టన్నులు), ఇరాన్ (6,094 టన్నులు).
బోర్డు కూర్పు దాని ఆవశ్యకత:
బోర్డు ప్రధానంగా పంట పై పరిశోధన చేసి కొత్త వంగడాలు ప్రవేశపెట్టడానికి కృషి చేస్తుందని, పియుష్ గోయల్ బోర్డు ఏర్పాటు సందర్భంగా అన్నారు. “బోర్డు పసుపు ఔషధ గుణాలను ప్రచారం చేయటం, ఉత్పత్తిని పెంచడం, కొత్త మార్కెట్లను వెతకడంపై దృష్టి పెడుతుంది. పసుపు నాణ్యత ఎగుమతుల పైన కూడా దృష్టి సారిస్తుందని,” గోయల్ అన్నారు.
బోర్డులో ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైతు సంక్షేమ డిపార్ట్మెంట్, వాణిజ్య శాఖ నుండి ప్రతినిధులు ఉంటారు. మహారాష్ట్ర, తెలంగాణ, ప్రసిద్ద ‘లకడాంగ్’ రకం పసుపును పండించే మేఘాలయ నుండి కూడా సభ్యులు ఉంటారు. బోర్డు ఉంటే అది మద్దతు ధరను ప్రకటిస్తుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పోయిన ఏడు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన ఉత్తరంలో పడిపోతున్న ధరలను అదుపు చేయటానికి నాఫెడ్ (NAFED) ద్వారా పసుపు కొనాలని కేంద్రానికి చేసిన విజ్ఞప్తి బోర్డు అవసరాన్ని దాని కార్యకలాపాల ప్రాధాన్యతను గుర్తు చేసింది. స్వామినాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగానే ఈ విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన రాశారు.
బోర్డు చైర్ పర్సన్ పల్లె గంగా రెడ్డి ని నిధుల కేటాయింపు పై వివరణ కోరగా కేంద్రానికి రు. 91 కోట్లకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. “వాణిజ్య మంత్రిత్వ శాఖకు రు. డెబ్బై వేల కోట్లు కేటాయించారు. మాకూ నిధులు కోరతాము. టి, కాఫీ బోర్డులు ఏర్పడి 50 సంవత్సరాల పైగా దాటింది. రబ్బర్ బోర్డు ఏర్పడి 20 సంవత్సరాలు అవుతోంది. సిబ్బందిని ఇప్పుడు కేటాయిస్తున్నారు. పసుపు బోర్డుకు అన్ని సౌకర్యాలు సమకూరుతాయి,” అని వివరించారు.
రైతులు, సంఘాల డిమాండ్లు:
పసుపు బోర్డు సాకారం వెనుక ఎన్నో నిరసనలు, పోరాటాలు ఉన్నాయని మోర్తాడ్ మండలం, డొంకల్ గ్రామ రైతు టి. తేజేశ్వర్ అన్నారు. “ఏడు ఎనిమిది సంవత్సరాలు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిరసనగా ధర్నా, రాస్తారోకోలు కూడా చేయనివ్వకపోవటంతో ప్రజాస్వామిక పద్దతిలో నిరసనగా 180 మంది రైతులు నామినేషన్లు వేసి ఒక సందేశం పంపాము. దీని మూలంగా రాజకీయ వ్యతిరేకత పెరిగి జిల్లాలో తన పార్లమెంటు నియోజకవర్గం లో అందరూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కవిత ఓడిపోయింది. బిజెపి తరపున పసుపు బోర్డు తెస్తామని వాగ్దానం చేసి అరవింద్ గెలిచాడు,” అని గుర్తు చేశారు.
నిధుల కేటాయింపుపై మాట్లాడుతూ, “రాజకీయ నాయకుల దృష్టి ఎన్నికల్లో గెలవటం మీదే వుంటుంది. అరవింద్ కు ముందు చాలా మంది వాగ్దానం చేశారు. ఇకనైనా తగిన నిధులు కేటాయించి మాకు న్యాయం చేయాలి,” అని ఆయన కోరారు.
గత పది సంవత్సరాలలో పంటకు ఎకరా పెట్టుబడి రు. 50,000 నుండి రు. లక్షకు చేరిందని ధరలు ఆ మేరకు పెరగలేదని ‘ఫెడరల్’ తో మాట్లాడిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పసుపు ఉడికించి, ఆరబెట్టటానికి తగిన యంత్రాలు ఇవ్వాలని మరో రైతు కుంట రవి శంకర్ రెడ్డి కోరారు. “బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే మకనా బోర్డుకు రు. వంద కోట్లు కేటాయించారు. ఈ సారి పసుపు రేటు బాగుంది. వచ్చే సంవత్సరం మరో అర ఎకరం పెంచి 2.5 ఎకరాల్లో పసుపు వేస్తాను. రేటు బాగుంది కాబట్టి ప్రస్తుతం రైతులు సంతోషంగా ఉన్నారు,” అని అన్నారు.
రెండు సంవత్సరాల నుంచి పసుపు పంటతో లాభాలు వస్తున్నాయి. పంట పది శాతం తగ్గి ఎగుమతులు పెరగటంతో ధరలు పెరిగాయని పసుపు వ్యాపారి ఎం. రాజేందర్ వివరించారు. “అధిక వర్షాలు పంటను దెబ్బతీశాయి. మన అవసరాల మేరకే పంట రావటంతో రేటు ఈ సారి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బోర్డు చేస్తున్న కార్యక్రమాలేవీ మా దృష్టికి రాలేదు,” అని పసుపు ను శుభ్రం చేసే యూనిట్ ఉన్న ఈ వ్యాపారి వివరించారు.
“రైతుల పోరాటానికి తలొగ్గి బోర్డు ను మంజూరు చేసిన కేంద్రం నిధులు కేటాయించలేదు. బోర్డు ద్వారా నూతన వంగడాల కోసం పరిశోధన, అంతర్జాతీయ మార్కెట్ లో అవకాశాలు కల్పించడం, ప్రొసెసింగ్ యూనిట్ లు ఏర్పాటు చేయడం, రైతులకు వ్యవసాయ సంబంధమైన సలహాలు ఇవ్వడం బోర్డు పని. అందుకు తగిన సిబ్బందిని ఇవ్వడానికి నిధులు అవసరం. మనం ఎగుమతి చేసే పసుపు ప్రొసెసింగ్ చేసి విలువ జోడిస్తే మన దేశానికి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇంత కీలకమైన సుగంధ ద్రవ్యానికి బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏటా పది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి,” అని అఖిల భారత రైతు సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ సారంపల్లి మల్లా రెడ్డి డిమాండ్ చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, “పరిశోధనలకు ప్రయోగ్యశాలలు ఏర్పాటు చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలి. డ్రైయర్ లు కొత్తవి రైతులకు ఇవ్వాలి. ఉనికిలో ఉన్న పసుపు రకాలు 36 డిగ్రీలు ఉన్న వేడిని మాత్రమే తట్టుకుంటాయి. దాదాపు 50 డిగ్రీ లకు వేడి పెరుగుతోంది. పసుపు పై పేటెంట్ హక్కులను అమెరికా కోర్టులలో కొట్లాడి నిలబెట్టుకున్న దేశం ఉత్పత్తి, ఉత్పాదకత పెంచి లాభపడటంలో వెనుకబడిపోతోంది. నిజామాబాద్ లో బోర్డు పెట్టడం సంతోషమే కానీ నిధులు కేటాయించకపోవటంతో రైతులకు దక్కాల్సిన ప్రయోజనం దక్కటం లేదు. పసుపుకు ఇది వరకు తెగుళ్లు పెద్దగా లేవు. ఇప్పుడు వస్తున్నాయి. వాటిని ఎదుర్కోవటానికి పరిశోధన జరగాలి. ఇవి విదేశాల నుంచి వచ్చినవే,” అని వివరించారు.

