రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం కుట్ర: ఆప్ మంత్రి అతిషి
x

రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం కుట్ర: ఆప్ మంత్రి అతిషి

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించబోతుందా? ఆప్ మంత్రి అతిషి వ్యాఖ్యలకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఏమని కౌంటర్ ఇచ్చారు.


దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. "అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేయడం ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో భాగమే. రాబోయే రోజుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెడతారని తెలిసింది. అలా చేయడం చట్టవిరుద్ధం.’’ అని పేర్కొన్నారు.

దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నందునే గత కొన్ని నెలలుగా ఢిల్లీలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించలేదన్నారు.

"చాలా డిపార్ట్‌మెంట్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉటంకిస్తూ.. మంత్రులు పిలిచే సమావేశాలకు బ్యూరోక్రాట్లు హాజరుకావడం మానేశారు. ఢిల్లీ ప్రభుత్వ పనితీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ MHAకి లేఖలు రాస్తున్నారు’’ అని అతిషి పేర్కొన్నారు.

దేశ రాజధానిలో తాము అధికారంలోకి రాలేమని బీజేపీకి ముందే తెలుసని మంత్రి అన్నారు. ‘‘2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీని ఓడించింది. అందుకే ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నందున రాష్ట్రపతి పాలన విధించడం చట్టవిరుద్ధం. మేం మెజారిటీని నిరూపించుకున్నాం. అని అతిషీ చెప్పారు.

సచ్ దేవా స్పందన..

అతిషి ఆరోపణపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ.. అసెంబ్లీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ‘రాష్ట్రపతి పాలన భయం’ వెంటాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. "అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే మంచిది - కొత్త ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని అప్పగించండి. ఢిల్లీ పాలన సక్రమంగా నడవనివ్వండి" అని సచ్‌దేవా జోడించారు.

Read More
Next Story