
అపార్ట్‌మెంట్లలో పీఎన్‌జీ తప్పనిసరి చేసిన కేంద్రం
అమల్లో వెనుకబడ్డ తమిళనాడు..
అపార్ట్‌మెంట్లలో సురక్షిత ఇంధన సరఫరాకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాలున్న ప్రాంతాల్లో పిఙ్గ (Piped Natural Gas) వాడకాన్ని తప్పనిసరిచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో పీఎన్‌జీకి మారని ఇళ్లకు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తారని మార్చి 24న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలో ఎదురవుతోన్న అంతరాయాల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక తమిళనాడు విషయానికొస్తే.. పీఎన్‌జీ వినియోగంలో వెనుకబడ్డ రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇప్పుడు కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయడం పెద్ద సవాలుగా మారింది.
అసలు కారణాలేంటి?
తమిళనాడులో పీఎన్‌జీ అమలు మందగించడానికి పలు కారణాలున్నాయని నిపుణులు అంటున్నారు. పైపింగ్ మౌలిక సదుపాయాల లోపం, ప్రజల్లో ఉన్న “ఒక సిలిండర్ ఉంటే చాలు” అన్న భావన ప్రధాన అడ్డంకులని వారంటున్నారు. అయితే పట్టణ ప్రణాళిక నిపుణులు మాత్రం.. అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేసి పీఎంజీ గ్యాస్ సరఫరా చేయాలంటున్నారు.
పీఎన్‌జీకి ప్రాధాన్యం ఇవ్వని ప్రభుత్వం..
రాష్ట్రం రోడ్లు, మురుగు, పారిశుధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ, పీఎన్‌జీ విధానానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదన్నది నిపుణుల మాట.
చెన్నైలో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే పీఎన్‌జీపై పని చేస్తున్నాయని పేర్కొన్నారు. నగరానికి బయట గ్యాస్ నిల్వ సదుపాయాలు ఉన్నా.. నగరంలో విస్తృత స్థాయి ప్రణాళికలు లేవని తెలిపారు.
కొంతమంది నిపుణులు రాజకీయ ప్రయోజనాలను కూడా కారణంగా చూపుతున్నారు. ప్రైవేట్ ఎల్‌పీజీ కంపెనీలతో రాజకీయ సంబంధాలు ఉండటం వల్ల పీఎన్‌జీకి ప్రాధాన్యం తగ్గిందని విమర్శిస్తున్నారు.
పరిమితంగా కంపెనీలు..
చెన్నైలో ప్రస్తుతం రెండు ప్రధాన ప్రైవేట్ సంస్థలు మాత్రమే పీఎన్‌జీ పంపిణీ చేస్తున్నాయి. అది కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సేవలందిస్తున్నారు. కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్లు కొంతమేరకు పీఎన్‌జీకి మారుతున్నా.. ఎక్కువ ఇళ్లలో ఎల్‌పిజీ సిలిండర్ల వాడకమే ఎక్కువ.
పైప్‌లైన్ నిర్మాణం, భూసేకరణ, అనుమతులు వంటి అంశాలు పెద్ద సవాళ్లుగా మారాయి. అనుమతులు ఆలస్యంగా రావడం వల్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ప్రైవేట్ సంస్థలు చెబుతున్నాయి.
ఖర్చు తగ్గినా, వినియోగం తక్కువ..
ఇటీవల పీఎన్‌జీ ధరలు తగ్గడంతో ఎల్‌పీజీ కంటే చౌకగా దొరుకుతుంది. అయినప్పటికీ వినియోగం పెద్దగా లేదు. ప్రజల్లో ఉన్న పాత అలవాట్లే ఇందుకు కారణం. అలాగే డిపాజిట్, మీటర్ ఛార్జీలు, భద్రతపై ఉన్న సందేహాలు కూడా పీఎన్‌జీకి మారకపోవడానికి కారణమని చెబుతున్నారు.
ముందంజలో మెట్రో నగరాలు..
దేశంలోని ఇతర మెట్రో నగరాలు పీఎన్‌జీ వినియోగంలో ముందంజలో ఉన్నాయి. ఢిల్లీలో లక్షలాది గృహాలకు పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా వేల సంఖ్యలో కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు. అలాగే ముంబై, పూణే, అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాలు కూడా బలమైన పీఎన్‌జీ నెట్‌వర్క్ కలిగి ఉన్నాయి. బెంగళూరులో కూడా వేగంగా విస్తరిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1.6 కోట్ల పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నాయి. మార్చి మొదటి మూడు వారాల్లోనే 3.5 లక్షల కొత్త కనెక్షన్లు జారీ కావడం గమనార్హం.
కేంద్రం విధించిన మూడు నెలల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, తమిళనాడు త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే, పీఎన్‌జీ అమలులో ఇప్పటికే ముందంజలో ఉన్న ఇతర నగరాల కంటే మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.
కేంద్రం ఇచ్చిన గడువులోగా పీఎన్‌జీ విస్తరణ పూర్తవుతుందో లేదో చూడాలి.

