మిత్రమా, కుశలమా!  కేసీఆర్ కి చంద్రబాబుకి పరామర్శ
x
కేసీఆర్ ను ఆస్పత్రిలో పరామర్శిస్తున్న చంద్రబాబు

మిత్రమా, కుశలమా! కేసీఆర్ కి చంద్రబాబుకి పరామర్శ

పాత మిత్రుడు, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు.


రాజకీయాలు పార్టీలకే కాని మానవ సంబంధాలకు కాదు కదా. ఇదిగో ఈ దృశ్యం అలాంటిదే. టీడీపీలో ఉండగా వాళ్లిద్దరూ మిత్రులు. కలిసి అసెంబ్లీలో కొట్లాడారు. కలిసి పని చేశారు. కాలక్రమంలో దారులు వేరయ్యాయి. ఇద్దరూ చేరో పార్టీకి అధ్యక్షులయ్యారు. అటువంటి పాత మిత్రుడు, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. తుంటికి శస్త్రచికిత్స చేయించుకుని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ వద్దకు వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు కేటీఆర్, ఇతరులను ఓదార్చారు. కేసీఆర్ వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

మాట్లాడాలనిపించి వచ్చా మిత్రమా!


‘‘ కేసీఆర్ తో మాట్లాడాలనిపించి వచ్చాను. కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్‌ చేశారు. త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారు’’ అని చంద్రబాబు ఆస్పత్రి బయట మీడియాతో చెప్పారు.

భట్టి పరామర్శ...

యశోద ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను పలువురు నేతలు పరామర్శించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. కేసీఆర్ కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు భట్టికి చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌, బీఎస్పీ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ కూడా కేసీఆర్‌ను పరామర్శించి, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. వెంటనే హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.

Read More
Next Story