తెలంగాణలో చికెన్‌ రేటు రచ్చ
x

తెలంగాణలో చికెన్‌ రేటు రచ్చ

బంద్‌తో మాంసం మార్కెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. వినియోగదారులు ప్రత్యామ్నాయాలకు మొగ్గుచూపుతున్నారు.


రాష్ట్రంలో చికెన్ ధరపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమకు మార్జిన్ పెంచే వరకు నిరసిస్తామని వ్యాపారస్తులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో చికెన్ సెంటర్ల బంద్ ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ధరలు తగ్గించినప్పటికీ, సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. పౌల్ట్రీ కంపెనీలు బర్డ్ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించినట్లు వెల్లడించాయి. దాంతో పాటు రిటైలర్లకు కిలోకు రూ.15 మార్జిన్ ఇవ్వడానికి కూడా ఓకే చెప్పాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ విరమించాలని స్థానిక ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. బంద్ ప్రశాంతంగా జరిగిందని నాయకత్వం తెలిపింది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా మాత్రం ఇంకా సాధారణ స్థితి రాలేదు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన బంద్ ఏప్రిల్ 2న కూడా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. దాదాపు 50 వేల దుకాణాలు మూతపడినట్లు తెలుస్తోంది. ఈ బంద్‌కు ప్రధాన కారణం మార్జిన్ తగ్గింపే. గతంలో కిలోకు రూ.25 నుంచి రూ.35 వరకు లాభం వచ్చేదని, ఇప్పుడు అది రూ.5 నుంచి రూ.10కు పడిపోయిందని వ్యాపారులు పేర్కొన్నారు. అద్దెలు, కరెంట్ బిల్లులు, కూలీ ఖర్చులు పెరగడంతో వ్యాపారం కొనసాగించడం కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పౌల్ట్రీ కంపెనీలు ధరలను ఏకపక్షంగా నిర్ణయిస్తున్నాయన్న అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్జిన్ పెంచే వరకు బంద్ కొనసాగిస్తామని సంఘం స్పష్టం చేసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో బంద్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ బంద్ ప్రభావంతో చికెన్ ధరలు కొన్ని ప్రాంతాల్లో ఆకాశాన్నంటుతోంది. కిలో రూ.400 పలుకుతున్నట్లు సమాచారం. చికెన్ లభించకపోవడంతో నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా తక్కువగా కొనుగోలు చేసే ఈ కోళ్ల అమ్మకాలు బంద్ సమయంలో పెరిగినట్లు తెలుస్తోంది.

ఇక మాంసం విక్రయాలు కూడా 20 నుంచి 25 శాతం పెరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నట్లు సమాచారం. ముందుగానే పరిస్థితిని అంచనా వేసిన వ్యాపారులు ఎక్కువగా స్టాక్ సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్ ఔట్‌లెట్లు మాత్రం తెరిచి ఉండగా, ఇతర షాపుల యజమానులు వాటి వద్ద నిరసన వ్యక్తం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎల్బీ నగర్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం.

ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరినట్లు సమాచారం. ఈ బంద్ ప్రభావం హోటళ్లు, బిర్యానీ కేంద్రాలపై కూడా పడుతోంది. సరఫరా తగ్గడంతో వ్యాపారాలు ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ధరలు తగ్గినా, మార్జిన్ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ప్రభుత్వం, పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తదుపరి నిర్ణయాలు పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Read More
Next Story