
అల్లరి చేశాడని పిల్లాడిని చావబాదిన టీచర్
వెంకటాపూర్ అంగన్వాడీ కేంద్రంలో బాలుడికి తీవ్ర గాయాలు. తండ్రి ఫిర్యాదుతో టీచర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు.
చిన్నపిల్లలు అంటే ముందుగా గుర్తొచ్చేది వాళ్లు చేసే అల్లరి, ముద్దుముద్దు మాటలే. కానీ అదే అల్లరి చేశాడని ఓ చిన్నారిని అంగన్‌వాడీ టీచర్ చావబాదిన ఘటన రాజన్న సిరిసిల్లలో కలకలం రేపుతోంది. టీచర్ కొట్టిన దెబ్బలకు చిన్నారి కంటి చుట్టూ నల్లగా కమిలిపోయి.. కన్ను లొట్టపోయిందా అనేలా మారింది పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొంపెల్లి లక్ష్మీ, విజయ్ కుమార్ దంపతులు తమ కుమారుడు విద్వాన్ష్‌ను అంగన్వాడీ కేంద్రంలో వదిలి పనుల కోసం వెళ్లారు. సాధారణంగా జరిగేదే అన్న భావనతో బాలుడిని అక్కడే ఉంచారు.
కొంతసేపటి తర్వాత అంగన్వాడీ టీచర్ రాణి ఫోన్ చేసి బాలుడికి జ్వరం వచ్చిందని, ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు కేంద్రానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి బాలుడి కంటికి, చేతులకు గాయాలు కనిపించాయి. పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడు అల్లరి చేశాడని కొట్టడంతో ఈ గాయాలు అయ్యాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ముఖ్యంగా కంటికి తీవ్రమైన గాయం కావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అంగన్వాడీ టీచర్ రాణిపై కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయాల పరిస్థితి, సంఘటనకు కారణాలపై విచారణ కొనసాగుతోంది. అధికారుల నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

