చింతపల్లి నీటి చింతలు తీరాయి :జాతీయ జలశక్తి అవార్డు
x
చింతపల్లి గ్రామం ఏరియల్ వ్యూ : జాతీయ స్థాయిలో ఆదర్శగ్రామం

చింతపల్లి నీటి చింతలు తీరాయి :జాతీయ జలశక్తి అవార్డు

పల్లె నుంచి జాతీయ స్థాయికి..మంచినీటి నిర్వహణలో ఆదర్శం


తెలంగాణ రాష్ట్రంలోని చింతపల్లి (Chintapalli) గ్రామం జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు పొందింది. సురక్షితమైన మంచినీటిని గ్రామస్థులకు అందించడంలో ఆదర్శంగా నిలవడంతో పాటు వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే సైబీరియన్ కొంగలను పరిరక్షిస్తూ ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామానికి జలశక్తి మిషన్ (Jal Shakti Mission) నుంచి జాతీయ అవార్డు దక్కింది.ఒకప్పుడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ చిన్న గ్రామం… ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.


చుట్టూ పచ్చని పొలాలు...చెంతనే దూబాలమ్మ చెరువు...జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి కుగ్రామానికి నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామం మరో సారి జాతీయ వార్తల్లోకి ఎక్కింది. 5వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన సైబీరియన్ కొంగలను పరిరక్షించడంలోనే కాకుండా సురక్షితమైన మంచినీటిని సరిపడా గ్రామస్థులకు అందజేసి జాతీయస్థాయిలో చింతపల్లి గ్రామం జాతీయ జలశక్తి మిషన్ నుంచి అవార్డును సాధించింది.



నాడు నీటి కోసం చింతలు

చింతపల్లి గ్రామంలో గతంలో రక్షిత మంచినీరు దొరికేది కాదు, భూగర్భజలాల నీటమట్టం పడిపోయి, బోర్లు ఎండిపోయి ప్రజలు నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొన్నారు.గతంలో తాగటానికి నీరు లేక గ్రామస్థులు అల్లాడారు. కానీ మిషన్ భగీరథ పథకం రాకతో పాటు గ్రామస్థులు, గ్రామ వాటర్ శానిటేషన్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా రక్షిత మంచినీటి పథకాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు.

నేడు రెండుపూటలా నల్లా నీటి విడుదల

చింతపల్లి గ్రామానికి రక్షిత మంచినీటిని అందించేందుకు పాలేరు జలాశయం నుంచి జీళ్ల చెరువులోకి నీరు రప్పించి అక్కడి నుంచి గ్రామానికి పైపు లైన్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. చింతపల్లి గ్రామంలో 442 ఇళ్లలో 1745 మంది జనాభా నివశిస్తుండగా, ఇందులో 882 మంది పురుషులు, 863 మంది మహిళలున్నారు. వ్యవసాయం ప్రధాన వృత్తి అయిన ఈ గ్రామస్థులకు నీటి పథకం నిర్మాణంతో నీటి చింతలు తీరాయి.
ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం మూడు గంటలపాటు మంచినీటిని సరఫరా చేస్తున్నామని చింతపల్లి గ్రామ పంచాయతీ ఉద్యోగి కొట్టే తిరుపతి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మంచినీటిని పరీక్షిస్తున్న డ్వాక్రా మహిళలు

డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో వాటర్ టెస్టులు
గ్రామంలో మంచినీటిని ప్రతీరోజూ డ్వాక్రామహిళలు నాణ్యత పరీక్షలు చేసి వినియోగించుకుంటున్నారు. నాణ్యతలో రాజీపడకుండా ప్రతీరోజూ నీటిని విడుదల చేసే ముందు బ్లీచింగ్ పౌడరును తగిన పాళ్లలో కలుపుతున్నామని, అందువల్లే సురక్షిత మంచినీరు గ్రామంలో ఇంటింటికి అందిస్తున్నామని డ్వాక్రా సంఘానికి చెందిన చింతపల్లి సునీత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వేసవి కాలంలోనూ తమ గ్రామంలో ఇంటింటికి రెండు పూటలా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నామని సునీత పేర్కొన్నారు.



రెండు నీళ్ల ట్యాంకులు, సంపు నిర్మాణం

చింతపల్లి గ్రామానికి జీళ్ల చెరువు నుంచి పైపులైన్ ద్వారా వస్తున్న నీటిని లక్షా ఇరవైవేల లీటర్ల కెపాసిటీ గల సంపులో నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత సంపు నుంచి నీటిని గ్రామంలో నిర్మించిన రెండు నీళ్ల ట్యాంకులలోకి ఎక్కిస్తున్నామని గ్రామ పంచాయతీ కార్యదర్శి లకావత్ రవీంద్రలాల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రోజుకు లక్షల లీటర్ల నీటిని ట్యాంకుల్లోకి ఎక్కించి సరఫరా చేస్తున్నామన్నారు. నీళ్ల ట్యాంకులను తాము నెలకు రెండు సార్లు శుభ్రం చేయిస్తున్నామని, దీనివల్ల రక్షిత నీరు గ్రామస్థులకు అందజేయగలుగుతున్నామని ఆయన తెలిపారు.
సరిపడా మంచినీటిని, క్వాలిటీతో సరఫరా చేస్తుండటంతో జాతీయ జలశక్తి మిషన్ అధికారులు మా గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా ఎంపిక చేశారు అని గ్రామ కార్యదర్శి లకావత్ రవీంద్రలాల్ చెప్పారు.



చింతపల్లి గ్రామంలో ఇంటింటికి నల్లాలు

చింతపల్లి గ్రామంలో ప్రతీ ఇంటికి నల్లాతోపాటు ఇంకుడు గుంతలను నిర్మించామని చింతపల్లి గ్రామ పెద్ద ముత్యాల కృష్ణారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇంటికో ఇంకుడు గుంత నిర్మాణం వల్ల గ్రామంలో భూగర్భజలాల నీటిమట్టం కూడా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో వాటర్ శానిటేషన్ కమిటీ పర్యవేక్షణలో సురక్షిత మంచినీటిని సరిపడా సప్లయి చేస్తుండటంతో జాతీయ జలశక్తి మిషన్ అవార్డు తమ గ్రామానికి వచ్చిందని కృష్ణారావు వివరించారు. తమ గ్రామంలో వేసవికాలంలోనూ ఇంటింటికి కొళాయి ద్వారా రక్షితమంచినీటిని సరిపడా సప్లయి చేస్తున్నామన్నారు. త్వరలో ఢిల్లీ నుంచి జలశక్తి మిషన్ అధికారులు చింతపల్లి గ్రామానికి వచ్చి ఈ పథకం సక్సెస్ ను పరిశీలించనున్నారని చింతపల్లి గ్రామ సర్పంచ్ మరియమ్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఇంకుడు గుంతలను పరిశీలిస్తున్న పంచాయతీ అధికారులు


మంచినీటి నిర్వహణలో గ్రామస్థుల ఐక్యత, మహిళల భాగస్వామ్యం, గ్రామ పంచాయతీ సమన్వయంతో చింతపల్లి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచింది. గ్రామీణ స్థాయిలో సరైన ప్రణాళికతో పని చేస్తే నీటి సమస్యలను ఎలా అధిగమించవచ్చో ఈ గ్రామం చూపించింది.



Read More
Next Story