
చిరుకూరి ఆలయ సౌందర రాజన్ మృతి
వృద్దాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన ఇబ్బంది పడుతున్న సౌందర రాజన్.
చిరుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు పితృవియోగం. ఆయన తండ్రి సౌందర్ రాజన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబీకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
సౌందరరాజన్ నేపథ్యం
డాక్టర్ సౌందరరాజన్ నేపథ్యం ఎంతో విశిష్టమైనది. ఆయన ఎం.కామ్, ఎల్‌ఎల్‌బీ పట్టాలతో పాటు కామర్స్‌లో డాక్టరేట్ పొందారు. గతంలో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటి పారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1981లో ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డును కూడా అందుకున్నారు.
వంశపారంపర్య అర్చక కుటుంబంలో జన్మించిన ఆయన, తన తండ్రి రాఘవాచారి నుంచి లభించిన ఆధ్యాత్మిక విలువలతో చిలుకూరు ఆలయాన్ని ఒక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆలయాల్లో హుండీ వ్యవస్థను, విఐపి దర్శనాలను, టికెట్ పద్ధతులను రద్దు చేస్తూ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. దేవుడి ముందు భక్తులందరూ సమానమేనని చాటిచెబుతూ ఆర్జిత సేవలను కూడా నిలిపివేశారు.
ఆయన సేవలు కేవలం ఆలయానికే పరిమితం కాలేదు. సమాజంలో కుల వివక్షను రూపమాపేందుకు ఒక దళిత భక్తుడిని తన భుజాలపై మోసుకుని ఆలయ ప్రవేశం చేయించి 'మునివాహన సేవ' ద్వారా చరిత్ర సృష్టించారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి చట్టపరమైన పోరాటాలు చేసిన ఆయన, అర్చక హక్కుల పరిరక్షణలో అగ్రగామిగా నిలిచారు. ఒక ఇంజనీర్ తార్కికతను, అర్చకుడి ఆధ్యాత్మికతను జోడించి చిలుకూరు క్షేత్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు.

