
అభిజీత్ దీప్కే నానమ్మ కన్నుమూత
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నానమ్మ సావిత్రిబాయి మహారాష్ట్రలో కన్నుమూశారు. దిల్లీ పోలీసుల అదుపులో ఉన్న దీప్కే అంత్యక్రియలకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట విషాద ఘగటన చోటు చేసుకుంది. ఆయన నానమ్మ సావిత్రిబాయి శంకర్ దీప్కే (85) మహారాష్ట్రలోని హింగోలీ జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో శనివారం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అభిజీత్ దీప్కే దిల్లీలో నిర్వహించ తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు ముంబయి నుంచి వచ్చారు. దిల్లీ విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో సావిత్రిబాయి మరణవార్తను దిల్లీ పోలీసులు దీప్కేకు తెలియజేశారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన ఎప్పుడు బయలుదేరుతారనే దానిపై స్పష్టత లేదు. సావిత్రిబాయి అంత్యక్రియలు ఆదివారం ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. నిరసన కొనసాగించాలా, స్వగ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొనాలా అన్నది దీప్కే నిర్ణయంపై ఆధారపడి ఉంది.
