
జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు బొద్దింకల డిమాండ్.. 48 గంటలే టైమ్..!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ను నిలిపివేయాలని, స్వతంత్ర విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరింది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి 48 గంటల్లోగా రాజీనామా చేయాలని సీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తాము దేశవ్యాప్తంగా నిరసన చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ప్రజల ఓటు హక్కును లాక్కునే అధికారం ఎవరికీ లేదని అభిజీత్ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా జ్ఞానేష్ కుమార్.. బీజేపీ నేత అమిత్ షా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఈ దేశంలో ఉన్న అతిపెద్ద జాతి వ్యతిరేకి జ్ఞానేష్ కుమార్. భారత దేశ ప్రజాస్వామ్యానికి అతను ఓ పెద్ద ప్రమాదం. ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి’’ అని అభిజిత్ డిమాండ్ చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో పలు సమస్యలు ఉన్నాయంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తారని, అయినా వారి వాదనలు పట్టించుకోకుండా ఎస్ఐఆర్ కొనసాగుతోందన్న వార్తలు విపరీతంగా వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఈ కథనంతో దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే సీజేపీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా తమ డిమాండ్లను వెల్లడించారు.
రాజకీయ పార్టీలకు దీప్కే పిలుపు
ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తే రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి తీసుకోవాలని దీప్కే కోరారు. ఎన్నికల్లో పాల్గొంటూనే ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సీజేపీ ప్రకటించింది. ప్రతి రాష్ట్రానికి వెళ్లి ప్రజలను కలుస్తామని, ఓటు హక్కు కోసం నిరసనలకు రావాలని కోరతామని నేతలు తెలిపారు.
సీజేపీ మూడు డిమాండ్లు
సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ మూడు ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. మొదటగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని కోరారు. ఎస్ఐఆర్ నిర్ణయాల వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయో కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రెండో డిమాండ్‌గా రాబోయే ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆపాలని, 2025 జనవరి నాటి ఓటర్ల జాబితాను తిరిగి తీసుకురావాలని అన్నారు.
ఎస్ఐఆర్పై స్వతంత్ర విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత పత్రాలను భద్రపరచాలని కూడా కోరారు. మూడో డిమాండ్‌గా 2023లో ఎలక్షన్ కమిషన్ అధికారుల నియామకానికి తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని సీజేపీ కోరింది. పౌర సమాజం భాగస్వామ్యంతో కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం కేవలం ఓటు హక్కుపైనే ప్రభావం చూపదని ఆశుతోష్ రంకా అన్నారు. కొన్ని సందర్భాల్లో ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం ప్రభుత్వ పథకాలపై కూడా ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ వంటి ప్రాంతీయ పార్టీల్లో జరిగిన పరిణామాలను కూడా దీప్కే ప్రస్తావించారు. వాటి తర్వాత ఎన్నికల గుర్తుల కేటాయింపుపై వివాదాలు వచ్చాయని అన్నారు. ఇదే తరహా పరిస్థితిని పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు.
ఈసీపై వచ్చిన నివేదికతో చర్చ
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సార్లు కొన్ని నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పేర్ల పునరుద్ధరణ, ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే, ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎస్ఐఆర్తో పాటు అన్ని నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని తెలిపింది. ఈ అంశంపై రాజకీయంగా భిన్నమైన వాదనలు కొనసాగుతున్నాయి.
ఎన్నికల హక్కుపై సీజేపీ ప్రచారం
ఓటు హక్కు పరిరక్షణే ఇతర సమస్యల పరిష్కారానికి కీలకమని సీజేపీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాలల మౌలిక వసతులు, గిరిజన విద్య వంటి అంశాలపై తమ సంస్థ ప్రచారాలు నిర్వహిస్తోందని తెలిపారు. అయితే ప్రజల ఓటు హక్కే దెబ్బతింటే ఇలాంటి కార్యక్రమాలతో పెద్దగా మార్పు రాదని సీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎస్ఐఆర్, ఓటర్ల జాబితా, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలపై వచ్చిన ఆరోపణలు, వాటిపై ఈసీ వివరణలతో ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది.
