
ఇద్దరు బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు క్లీన్ చిట్
పార్టీ మారినట్లు బీఆర్ఎస్ పిటీషన్ దారులు ఎలాంటి ఆధారాలను చూపలేకపోయినట్లు స్పీకర్ చెప్పారు
ఇద్దరు బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది బీఆర్ఎస్(BRS) ఎంఎల్ఏల్లో కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. యాదయ్య చేవెళ్ళ నియోజకవర్గంలోను, (Pocharam)పోచారం బాన్సువాడ నియోజకవర్గంలోను 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటంతో పాటు బీఆర్ఎస్ నాయకత్వంతో గ్యాప్ పెరిగిన కారణంగా పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కాంగ్రెస్ కు దగ్గరైన పదిమంది ఎంఎల్ఏలు చాలాకాలంగా బీఆర్ఎస్ కు దూరంగానే ఉంటున్నారు. అందుకనే వీరందరిపైనా అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కొందరు ఎంఎల్ఏలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
తమ ప్రయత్నాల్లో భాగంగానే వీళ్ళు ముందు హైకోర్టుకు తర్వాత సుప్రింకోర్టుకు వెళ్ళారు. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం పదిమంది ఎంఎల్ఏలపై విచారణ జరిపి ఏదో ఒక నిర్ణయం తీసుకోక స్పీకర్ కు తప్పలేదు. ఇందులో భాగంగానే పదిమంది ఎంఎల్ఏల్లో ఎనిమిది మందిని స్పీకర్ విచారించారు. విచారణ తర్వాత ఈమధ్యనే ఐదుగురు ఎంఎల్ఏలు అరెకపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, టీ ప్రకాష్ గౌడ్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా యాదయ్య, పోచారం పార్టీ మారినట్లు బీఆర్ఎస్ పిటీషన్ దారులు ఎలాంటి ఆధారాలను చూపలేకపోయినట్లు స్పీకర్ చెప్పారు.
అందుకనే ఈ ఇద్దరు ఎంఎల్ఏలపైన బీఆర్ఎస్ ఎంఎల్ఏల అనర్హత పిటీషన్లను తిరస్కరించినట్లు తీర్పిచ్చారు. ఇక మిగిలింది ముగ్గురు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ విచారణ మాత్రమే. వీరిలో దానం, కడియం స్పీకర్ విచారణకు హాజరుకాలేదు. కాబట్టి వీళ్ళ విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పిస్తారో ? స్పీకర్ తీర్పుపై కేటీఆర్ అండ్ కో ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

