‘ముందు మూసీని శుభ్రం చేయండి.. గుళ్లు తర్వాత కట్టొచ్చు’
x

‘ముందు మూసీని శుభ్రం చేయండి.. గుళ్లు తర్వాత కట్టొచ్చు’

ముసీ నది కాలుష్యంపై ఫోరం ఆందోళన. శుద్ధి పూర్తయ్యే వరకు ఇతర అభివృద్ధి పనులను వాయిదా వేయాలని సూచన.


మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం స్టార్ట్ చేయడంపై ఫారమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. మూసీ ఒడ్డున మతపరమైన కట్టాడాలు కట్టడానికి ముందు మురికి కూలంగా ఉన్న మూసీని శుభ్రం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆలయాల నిర్మాణాలకన్నా ఎక్కువ మూసీని శుభ్రం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. శుక్రవారం మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు ఈ ఫారమ్ ఒక రిప్రజెంటేషన్‌ను అందించింది. అందులో ప్రభుత్వం తీసుకున్న మూసీ పునరుజ్జీవన ఆలోచనకు మద్దతు పలికింది. కానీ.. మూసీ పరివాహక ప్రాంతాల్లో మతపరమైన నిర్మాణాలను చేయాలనుకోవడాన్ని ఖండించింది. కాలుష్యాన్ని పక్కనబెట్టి మంచిరేవుల దగ్గర ఆలయాన్ని కట్టాలన్న ఆలోచనను తప్పుబట్టింది.

ఈ రిపోర్ట్‌లో మరిన్ని విషయాలను కూడా ఫారమ్ ప్రస్తావించింది. మార్చి 29న ఓంకారేశ్వర ఆలయానికి భూమిపూజ చేశారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా అధికారులు ఆలోచన చేశారు. ఈ ఆలయ నిర్మాణం రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఫారమ్ అంచనా వేసింది. అంతేకాకుండా గతంలో చేపట్టిన శుద్ధి ప్రాజెక్టులపై కూడా ఫోరం ప్రస్తావించింది. 2001లో కేంద్రం ఆమోదంతో చేపట్టిన ప్రణాళికకు ₹405 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని తెలిపింది.

హైకోర్టు సమీపంలో రూ.50 కోట్లతో నిర్మించిన రబ్బర్ డ్యామ్ కూడా విఫలమై తర్వాత తొలగించినట్లు పేర్కొంది. 2011లో రూపొందించిన “ముసీ ఫేజ్-II” ప్రాజెక్ట్ రూ.750 కోట్ల అంచనాతో పంపినా ఆమోదం లభించలేదని తెలిపింది. తర్వాత 2012లో రూ.17,130 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికలో లోపాల కారణంగా నివేదిక ఆమోదం పొందలేదని వివరించింది. కాలక్రమంలో ఆక్రమణల వల్ల నది వెడల్పు తగ్గిపోయిందని ఫోరం తెలిపింది. అనేక ప్రాంతాల్లో అది కాలువలా మారిందని పేర్కొంది. శుద్ధి చేయని మురుగునీరు నదిలోకి వస్తూనే ఉందని చెప్పింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముసీని అత్యంత కాలుష్యిత నదిగా గుర్తించినట్లు గుర్తుచేసింది. 2015లో కాలుష్య నియంత్రణ మండలి కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. ఔషధ సంస్థలు, పరిశ్రమలు శుద్ధి చేయని వ్యర్థాలను నదిలో విడుదల చేస్తున్నాయని ఫోరం ఆరోపించింది. ఉన్న శుద్ధి కేంద్రాలు సమర్థంగా పనిచేయడం లేదని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో నది నీరు జీవవైవిధ్యం, వ్యవసాయం, మానవ వినియోగానికి అనర్హంగా మారిందని తెలిపింది. శుద్ధి ఒక దీర్ఘకాలిక ప్రక్రియ అని అభిప్రాయపడింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆలయాలు నిర్మించడం సరైనది కాదని ఫోరం సూచించింది. కాలుష్య నదిలో శివ విగ్రహం ప్రతిష్ఠించడం అనుచితమని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ముందుగా సమగ్ర శుద్ధి చేపట్టి, తర్వాత ఇతర అభివృద్ధి పనులు ఆలోచించాలని ప్రభుత్వం వద్ద ఫోరం కోరింది. ఈ వినతిపత్రాన్ని ఫోరం అధ్యక్షుడు ఎం. పద్మనాభ రెడ్డి సమర్పించారు.

Read More
Next Story