కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం స్పెషల్ ఫోకస్..
x

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం స్పెషల్ ఫోకస్..

కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల మరమ్మతులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని సూచనలు.


కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫోకస్ పెట్టారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని మూడు బ్యారేజీలను మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలానికి ముందే కీలక పనులు పూర్తిచేయాలని సూచించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సంబంధిత అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేసి, పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్లతో కలిసి ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రతి దశలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్ మాత్రమే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజిని పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించినట్టు తెలిపారు. మేడిగడ్డ వద్ద 500 బోరు బావులు తవ్వడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. అవసరమైన యంత్రాలను సమకూర్చుకుని పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

మరమ్మతులకు సంబంధించిన డిజైన్లు సిద్ధం చేసి, డిసెంబర్ వరకు పనుల పూర్తి షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం, నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వబోమని పేర్కొన్నట్టు సమాచారం. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, పనులు ప్రారంభమైన తర్వాత స్వయంగా వచ్చి పరిశీలిస్తానని తెలిపారు.

Read More
Next Story