పెరగనున్న హైదరాబాద్ మెట్రో రైళ్ల సంఖ్య !
x

పెరగనున్న హైదరాబాద్ మెట్రో రైళ్ల సంఖ్య !

ప్రయాణికుల సౌకర్యం కోసం MMTS సేవల్లో మార్పులు, ఫ్రీక్వెన్సీ పెంపు, కనెక్టివిటీ మెరుగుదలపై సీఎం సూచనలు.


హైదరాబాద్ మెట్రో సేవలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉన్నతాధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో మెట్రో సేవలు, సమస్యలపై చర్చించారు. అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ సేవలను పూర్తిగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలను తీర్చిదిద్దాలని తాజా సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పీక్ అవర్స్‌లో రైళ్ల సంఖ్య పెంచాలని, సమయపాలనను కచ్చితంగా పాటించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. స్టేషన్లకు చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో మినీ బస్సుల సేవలను పరిశీలించాలని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, చివరి మైలు కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ మార్పులతో మరింత మంది MMTS వైపు ఆకర్షితులవుతారని అభిప్రాయం వ్యక్తమైంది. అదనంగా, టికెట్ కాకుండా ఇతర ఆదాయ వనరులను పెంచే విధానాలను రూపొందించాలని అధికారులకు తెలిపారు. ప్రయాణికుల సంఖ్య పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, సౌకర్యాల మెరుగుదలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడైంది. మొత్తంగా, నగర రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఈ సమావేశం స్పష్టం చేసింది.

Read More
Next Story