
కోకాపేట శారదా పీఠం భూములపై సీఎం కీలక ఆదేశాలు
కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను తిరిగి పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.
కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ భూములను మళ్లీ పీఠానికే కొనసాగించాలని నిర్ణయించారు. ఇటీవల జల మండలికి కేటాయించిన భూముల అంశం వివాదంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. కోకాపేటలో ఉన్న శారదా పీఠం భూములను జల మండలికి కేటాయించిన తర్వాత అక్కడ జరుగుతున్న నిర్మాణాల విషయాన్ని పీఠం ప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాల ప్రస్తుత పరిస్థితిని అధికారులు వివరించారు.
భూములను జల మండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల వివరాలు తెలియజేయకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తదుపరి చర్యగా జల మండలికి చేసిన కేటాయింపులను రద్దు చేసి భూములను శారదా పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే నిర్మాణాల పరిస్థితి, ఇతర అంశాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వివరించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు. ఈ అంశంపై సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకుంటాయని అధికారులు తెలిపారు.

