
జ్యూరిక్ చేరుకున్న రేవంత్ టీమ్
ప్రముఖ గ్లోబల్ కంపెనీల అగ్రశ్రేణి ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమం
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందం జ్యూరిక్‌కు చేరుకున్నారు. జ్యూరిక్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసులు ఈ బృందానికి ఘన స్వాగతం పలికారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సమావేశం–2026లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌కు వచ్చిన ముఖ్యమంత్రి బృందంలో రెవెన్యూ, హౌసింగ్, ఐ&పీఆర్ శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు సీనియర్ అధికారులు ఉన్నారు. ఐటీ, ఈ&సీ, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన వ్యవహారాల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు ఇప్పటికే డావోస్‌కు చేరుకున్నారు.
WEF తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ గ్లోబల్ కంపెనీల అగ్రశ్రేణి ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.
డిసెంబర్ 2025లో ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను కేంద్రంగా చేసుకొని, రాష్ట్రం దీర్ఘకాలిక వృద్ధి దృష్టి, ప్రగతిశీల విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని డావోస్ 2026 వేదికగా గ్లోబల్ నాయకులు, సీఈఓలు, పరిశ్రమ ప్రతినిధుల ముందుకు తీసుకెళ్లడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది.

