
అజ్ఞాత మావోయిస్టులకు సీఎం రేవంత్ పిలుపు
లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం, వైద్యం, వసతి కల్పిస్తామని సీఎం తెలిపారు. శాంతియుత మార్గంలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమని పేర్కొన్నారు.
అజ్ఞానంతో ఉన్న మావోయిస్ట్‌లు కూడా ఆయుధాలు విడిచిపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సీఎం రేవంత్ సమక్షంలో దాదాపు 127 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు. అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి కలవడానికి ముందుకొచ్చారు. ఆయుధాలను పోలీసులకు సరెండర్ చేశారు. ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి వారికి భరోసా కల్పించారు. వారికి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాటి పరిష్కారానికి తాము కృషి చేస్తామన్నారు. శాంతియుత మార్గంలో పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
శనివారం తన సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. లొంగుబాటు చేసిన వారికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని తెలిపారు. మావోయిస్టులకు ఆర్థిక సహాయం, ఆరోగ్య భద్రత అందిస్తామని చెప్పారు. మెరుగైన వైద్య సేవలు, వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని వెల్లడించారు. కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు కూడా అందజేస్తామని పేర్కొన్నారు.
హింసతో పరిష్కారం సాధ్యం కాదు
హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పోరాటాలు చివరకు శాంతియుత మార్గాల ద్వారానే ముగిసిన ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ శాంతియుత మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు తెలిపారు. దేశాల మధ్య యుద్ధాలు కూడా చివరకు చర్చల ద్వారానే ఆగుతున్నాయని పేర్కొన్నారు. ఇకపై మావోయిస్టులు హింసకు పాల్పడినా లేదా ఆయుధాలు కలిగి ఉన్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు.
పోలీసుల కృషికి అభినందనలు
మావోయిస్టుల్లో నమ్మకం కల్పించడంలో పోలీసుల పాత్ర కీలకమని సీఎం ప్రశంసించినట్లు తెలిపారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి, అదనపు డీజీ విజయ్ కుమార్ సహా పలువురు అధికారులు చేసిన కృషి ఫలితంగానే ఒకేసారి పెద్ద సంఖ్యలో సరెండర్ సాధ్యమైందని చెప్పారు. జనజీవన స్రవంతిలోకి చేరిన మావోయిస్టులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
చర్చల ద్వారా పరిష్కారానికి ప్రయత్నం
మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్‌లతో గతంలో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సీఎం తెలిపారు. వారి ఆలోచనలు, ఆవేదనలను ప్రభుత్వం అర్థం చేసుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. అజ్ఞాత జీవితం గడుపుతున్నవారిపట్ల సానుకూలంగా స్పందిస్తూ, ప్రాణాలకు హాని జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించినట్లు తెలిపారు.

