
ఆరోగ్యశ్రీ కోసం రూ.2,408 కోట్లు చెల్లించాం: సీఎం రేవంత్
ఆరోగ్యశ్రీ చెల్లింపులు, సీఎం రిలీఫ్ ఫండ్, కొత్త ఆస్పత్రులు, పేదల వైద్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీలో వివరించారు.
ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.727 కోట్లు మాత్రమే ఉన్నాయని, కానీ వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు కొందరు ప్రచారాలు చేస్తున్నారని రేవంత్ చెప్పారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చెల్లింపులను ఎప్పుడూ ఆపలేదని, అదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉందని వివరించారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌లో ఆరోగ్యశ్రీ బకాయిల అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
డిసెంబర్ 6, 2023 వరకు ఆరోగ్యశ్రీపై నెలకు సగటున 89 కోట్లు ఖర్చు అయ్యిందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ బకాయిలు మిగిల్చిందని, వాటిని భరించాల్సి వచ్చిందని వివరించారు. డిసెంబర్ 7, 2023 నాటికి 627 కోట్ల పెండింగ్ భారం వచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం డిసెంబర్ 8, 2023 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2408 కోట్ల రూపాయలు చెల్లించిందని చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు 927 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు 1480 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు మూతపడుతున్నాయన్న ప్రచారం తప్పుదోవ పట్టించేదిగా ఉందని తెలిపారు.
ఆరోగ్యశ్రీపై అపోహలు సృష్టిస్తున్నారని, కానీ ఈ పథకం ద్వారా చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగిందని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గతంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. కొందరు దుర్వినియోగం చేసినందుకు కేసులు కూడా నమోదయ్యాయని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు విధానం తీసుకువచ్చి అక్రమాలకు అడ్డుకట్ట వేసిందని చెప్పారు. ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2046 కోట్ల రూపాయలు అందించినట్లు వివరించారు.
పేదల వైద్యం కోసం మొత్తం 4500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 35 మెడికల్ కాలేజీల్లో రోగుల సంఖ్య తక్కువగా ఉందని, అక్కడ సరైన వైద్యులు లేరని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యశ్రీ రోగులను టీచింగ్ ఆస్పత్రులకు తరలించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణను గ్రూప్-1 అధికారులకు అప్పగించే యోచన ఉందని చెప్పారు.
కులగణన ఆధారంగా కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ జీవితం బీమా అందించనున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో పనిచేస్తున్న తెలుగు వైద్యుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వారు స్వదేశానికి వచ్చినప్పుడు సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వరంగల్, అల్వాల్, ఎల్‌బీనగర్, సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రులను ప్రత్యేక వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గోషామహల్‌లో 30 ఎకరాల్లో 3000 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.
అదనంగా 10 వేల పడకలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వైద్య రంగంలో నిరంతరం సవాళ్లు ఉంటాయని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్లు చెప్పారు. సభ్యుల సూచనలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. పేదల విద్య, వైద్యంలో ఒక్క రూపాయి కూడా కోత ఉండదని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు.

