
‘మెరిట్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడాం’
అభ్యర్థులు మెరిట్ మీద ఎంపికయ్యారని ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిందని గ్రూప్ 1, 2 అధికారుల సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
గ్రూప్-1, గ్రూప్-2 నూతన అధికారుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులు ఎలాంటి తప్పు చేయలేదని, వారు కేవలం తమ మెరిట్ మీదనే ఎంపికయ్యారని ప్రభుత్వం బలంగా నమ్మిందని ఆయన పేర్కొన్నారు. అందుకే, గిట్టని వారు కోర్టులకు వెళ్లినా వెనక్కి తగ్గకుండా, అభ్యర్థుల పక్షాన నిలబడి సుప్రీంకోర్టు వరకు వెళ్లి ప్రభుత్వం పోరాడిందని సీఎం స్పష్టం చేశారు.
నియామకాల్లో పారదర్శకత: గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్-1 నియామకాలను ప్రజా ప్రభుత్వం పూర్తి చేసిందని, టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేసి పరీక్షలపై అవగాహన ఉన్న వారినే బోర్డులో నియమించామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆధిపత్యాన్ని సహించరని, రాంజీ గోండు నుండి సమ్మక్క-సారలమ్మ వరకు అందరూ ఆధిపత్యంపైనే తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు.
బాధ్యతాయుతమైన సేవ: నిన్నటి వరకు నిరుద్యోగులుగా ఉన్న వారు నేడు అధికారులుగా మారి 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేయబోతున్నారని, ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లా పనిచేయాలని సూచించారు. పేదలకు సాయం చేసేటప్పుడు కన్నవారిని గుర్తుంచుకోవాలని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో 10-15 శాతం కోత విధిస్తూ త్వరలోనే చట్టం తెస్తామని హెచ్చరించారు.
అంతర్జాతీయ శిక్షణ: అధికారుల నైపుణ్యం పెంచేందుకు త్వరలోనే హార్వర్డ్ యూనివర్సిటీతో ఎంసీహెచ్‌ఆర్‌డీ (MCHRD) ఒప్పందం చేసుకోబోతోందని సీఎం వెల్లడించారు.

