మైనింగ్ మాఫియాతో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
x

మైనింగ్ మాఫియాతో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ

ఇసుక మాఫియాపై సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు పై విచారణకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్.


అక్రమ మైనింగ్ అంశంలో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలడంతో సభ వేడెక్కింది. ప్రభుత్వం కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ సాగుతుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పక్షం తోసిపుచ్చింది. అక్రమ మైనింగ్ మాఫియాపై యాక్షన్ తీసుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై సీబీసీఐడీ విచారణకు రేవంత్ ఆదేశించారు. సిరిసిల్ల ఇసుక మాఫియాపై సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు పై విచారణకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

‘‘గంగుల కమలాకర్ సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ పై విచారణకు సిద్ధం. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్ పై విచారణకు సిద్ధం. రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు వీటన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నాం. విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.

అయితే అసెంబ్లీలో మైనింగ్ మాఫియా అంశాన్ని మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తారు. నగర మధ్యలోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అనుమతులు లేకుండా క్రషర్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం జరుగుతోందని తెలిపారు. మైనింగ్ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చినా చర్యలు లేవని ఆయన అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖలు పంపినా స్పందన లేదని వివరించారు. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హరీష్‌రావు వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. పొంగులేటిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని సూచించారు. ఈ ఘటనతో అక్రమ మైనింగ్ అంశం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన విచారణతో తదుపరి పరిణామాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story