
ఆహార కల్తీకి చెక్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఆహార కల్తీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వ్యవస్థతో నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు.
తెలంగాణలో ఆహార కల్తీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి రోజూ బయటపడుతున్న ఆహార కల్తీ వ్యవహారాలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏం తినాలన్నా భయపడే పరిస్థితి ప్రజల్లో ఉంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ అధికారికంగా ప్రకటించారు. కల్తీ ఆహారానికి చెక్ పెట్టేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉన్న ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాల్‌లో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ వల్ల మాఫియా వ్యవస్థ పెరిగిందని గుర్తుచేశారు.
పేదలకు ఉపయోగపడేలా సన్నబియ్యం పథకం ప్రారంభించామని తెలిపారు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి సన్నవడ్లు పండించేందుకు ప్రోత్సహించామని చెప్పారు. అలాగే ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందించామని వెల్లడించారు. భవిష్యత్తులో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు. రైతులను పంట మార్పిడి విధానాల వైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

