
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక: 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం
తెలంగాణలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో పాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' పేరుతో మార్చి 6వ తేదీ నుండి జూన్ 12 వరకు, అంటే 99 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. శనివారం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమైన అంశాలు:
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు , ప్రజోపయోగ కార్యక్రమాలను క్షేత్రస్థాయి వరకు సమర్థవంతంగా చేరవేయడం. మార్చి 6 నుండి జూన్ 12 వరకు ఈ ప్రణాళిక అమలులో ఉంటుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని 4 కోట్ల ప్రజల పండుగలా ఘనంగా జరుపుకోవాలని, ఈ 99 రోజుల కార్యక్రమం దానికి నాంది కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సాంకేతికతతో పౌర సేవలు సులభతరం
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నల్లా కనెక్షన్, విద్యుత్ మీటర్లు, ఇంటి అనుమతుల వంటి సేవలను డిజిటలైజ్ చేయాలని సూచించారు.
సాంకేతిక మార్పులపై అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. రాబోయే 20 ఏళ్లకు సరిపడేలా ప్రభుత్వ సర్వర్లను ఆధునీకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్య, వైద్యం , మౌలిక సదుపాయాలు
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేలా వంద మండలాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను' ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలని, అద్దె భవనాలను వీడాలని ఆదేశించారు.
ఆర్థిక వృద్ధి , పెట్టుబడులు
రాష్ట్రానికి వచ్చిన 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. తెలంగాణను మూడు ఆర్థిక జోన్లుగా (క్యూర్, ప్యూర్, రేర్) విభజించి, దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 'ఫ్యూచర్ సిటీ' నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల మూడు నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రజలు మార్పును స్వాగతిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన రెండేళ్ల తొమ్మిది నెలల కాలంలో సుపరిపాలనే లక్ష్యంగా, పారదర్శకతతో పనిచేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఈ 99 రోజుల కార్యక్రమ పురోగతిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని వెల్లడించారు.
వచ్చే మూడు నెలల కాలంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి, తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

