Revanth Reddy Inaugurating Nalla cheruvu
x

ఇక హైదరాబాద్ చెరువుల చుట్టూ ... వినోదం విహారం

కూకట్‌పల్లిలో పునరుద్ధరించిన నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. చెరువులు, నాలాలు పునరుద్ధరించి హైదరాబాద్‌ను అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.


ఇక ముందు హైదరాబాద్ చెరువులన్నీ వినోదకేంద్రాలు , విహార కేంద్రాలుగా మారుతున్నాయి. వీటిని రాత్రి పొద్దుపోయే దాకా కలకలలాడేలా చేయబోతున్నారు. ఈప్రాంతాలన్నీ చిన్న చిన్న షాపులతో, క్యాంటీన్లతో సింగారించుకోబోతున్నాయి. ఇదే సమయంలో చెరువుల సుందరీకరణలో నిర్వాసితులయిన వారికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ దిశలో చెరువుల అభివృద్ధికి మరో అడుగు పడింది. సోమవారం నాడు కూకట్‌పల్లిలో పునరుద్ధరించిన నల్ల చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. చెరువులో గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

"పునరుద్ధరించిన చెరువు పార్కుల చుట్టూ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేద్దాం. స్టాల్స్ పెట్టాలి. పిల్లలు ఆడుకోవడానికి స్థలాల్లేవు. చెరువుల ఒడ్డున ఆటస్థలాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించుకుందాం. ఇలాంటి పనులు చేసుకునప్పుడు నిజంగానే కొందరికి నష్టం కలిగి ఉండొచ్చు. పేదవారు ఎవరికీ అన్యాయం చేయను. అలాంటి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్ధం చేశాం. నిజంగా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందాం," అని ముఖ్యమంత్రి చెప్పారు.

నగరంలో రోడ్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, నాలాల ఆక్రమణల తొలగింపు వంటి పనులు చేపట్టి హైదరాబాద్‌ను మంచి నగరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పిల్లలకు క్రీడా మైదానాలు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరంగా నిలిచిందని సీఎం తెలిపారు. అయితే ఆక్రమణలు తొలగించి, కాలుష్యాన్ని తగ్గించి మూసీ నదిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని హెచ్చరించినట్లు తెలిపారు.

హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు విమర్శలు వచ్చినప్పటికీ వాటిని సహించానని సీఎం తెలిపారు. నల్ల చెరువు పునరుద్ధరణ తర్వాత ప్రజల ముఖాల్లో కనిపించిన ఆనందం తనకు సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.

పునరుద్ధరించిన చెరువుల చుట్టూ పార్కులు, వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. పిల్లలు ఆడుకునే స్థలాలు లేకపోవడంతో చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేయాలని సూచించారు.

చెరువుల పునరుద్ధరణలో కొందరికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. అయితే పేదవారికి అన్యాయం చేయబోమని తెలిపారు. నిజంగా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా అందించనున్నట్లు చెప్పారు.

అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. అహ్మదాబాద్‌లో సబర్మతీ నది తీరం, ఢిల్లీలో యమునా నది తీరం, ఉత్తరప్రదేశ్‌లో గంగానది తీరం అభివృద్ధి చేసినట్లు హైదరాబాద్‌లో కూడా మూసీ నది ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ ఆరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ నవీన్ రావు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నగరంలోని చెరువులు, నాలాలు పునరుద్ధరించడంతో పాటు రోడ్ల విస్తరణ చేపట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.

Read More
Next Story