తెలంగాణ విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు
x

తెలంగాణ విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు

తెలంగాణలో 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లు, ఏఐ బోధన, విద్యార్థులకు ఉచిత బ్రేక్ ఫాస్ట్, కిట్స్ పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను' తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పాఠశాల మాదిరిగానే ఈ స్కూళ్లలో సకల వసతులు, రవాణా సౌకర్యం ఉండాలని స్పష్టం చేశారు. విద్యా శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు క్యూర్‌ (CURE) పరిధిలో 12 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఇంజినీర్లకు సూచించారు. వీటిలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వంటి ప్రైవేట్ స్కూళ్లలో ఉండే ఆధునిక వసతులు ఉండాలని పేర్కొన్నారు. అలాగే, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బోధించాలని, ఇందుకోసం ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో పాత కోర్సులను తొలగించి ఏఐ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టాలని తెలిపారు.

విద్యార్థుల సంక్షేమం కోసం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్‌తో పాటు పాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం విజయా డెయిరీ నుంచి పాలను సేకరించాలని, విద్యార్థులకు అందే పోషక విలువలను సాంకేతికత ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి బ్యాగులు, షూస్, డిక్షనరీ వంటి వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటికే రూ. 1000 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇతర వర్సిటీలకు అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని కోరారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు, రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో తుది కమిటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాల కోసం ముసాయిదాను ప్రజల ముందుకు తీసుకురావాలని సూచించారు.

చివరగా, తెలంగాణ విద్యా కమిషన్ అందించిన అంతర్జాతీయ విద్యా విధాన నివేదికను సీఎం పరిశీలించారు. అందులోని అంశాలను చట్టబద్ధంగా అమలు చేసే బాధ్యతను డాక్టర్ కేశవరావు నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో తెలంగాణ విద్యా రంగం భవిష్యత్తులో గ్లోబల్ ప్రమాణాలకు చేరువయ్యే అవకాశం ఉంది.

Read More
Next Story