
ఏఐ ప్రభావంపై సీఎం హెచ్చరిక.. విద్యలో భారీ మార్పులు
తెలంగాణలో విద్యా సంస్కరణలు వేగవంతం. యంగ్ ఇండియా స్కూల్స్, నాణ్యమైన విద్యపై సీఎం కీలక వ్యాఖ్యలు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం సునామీలా పెరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దీనివల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు భారీగా కోల్పోయే ప్రమాదం ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలు అవసరమని స్పష్టం చేశారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్ గూడెం రోడ్డులో ఏవీఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో మార్పులు అత్యవసరమని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను 100 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మొదటి దశలో 59 స్కూల్స్ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. ప్రతి స్కూల్ 25 ఎకరాల్లో నిర్మించి, 2,500 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. విద్య అందుబాటులో ఉన్నా నాణ్యతలో లోపాలు ఉన్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత తరగతుల్లో ఉన్న విద్యార్థులు తక్కువ తరగతుల పుస్తకాలు చదవలేకపోవడం భవిష్యత్తుకు ప్రమాదకరమని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నప్పటికీ, అవసరమైన నైపుణ్యాలు అందరికీ లేకపోవడం సమస్యగా మారిందని చెప్పారు. నాణ్యమైన విద్య లేకపోవడం ఉపాధి లోపానికి కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. బడ్జెట్‌లో 8.3 శాతం విద్యకు కేటాయించామని చెప్పారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి విద్య లేకపోవడం వల్లే ప్రైవేట్ స్కూల్స్ వైపు విద్యార్థులు మళ్లుతున్నారని వివరించారు.
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు ఉండగా, 11 వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 33 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు. ఈ వ్యత్యాసంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇదే నేపధ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో 100 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో మోడల్ స్కూల్స్‌ను కూడా ప్రయోగాత్మకంగా తీసుకురానున్నట్లు తెలిపారు.
ప్రైవేట్ స్కూల్స్ తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పౌష్టికాహారం అందించనున్నట్లు చెప్పారు. విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని సీఎం పేర్కొన్నారు. 2034 ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ క్రీడాకారులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

