
రిపబ్లిక్ డే: నాన్ వెజ్ తినొద్దని కలెక్టర్ ఆదేశాలు
దేశంలోని పలు ప్రాంతాలలో మున్సిపల్ సంస్థల ఆదేశాలు, జనవరి 26, 30 తేదీలలో అమలు, కోరాపుట్ లో ప్రజా ఆగ్రహంతో వెనక్కి తగ్గిన జిల్లా పాలనాధికారి
గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాన్ వెజ్, మత్తు పదార్థాల అమ్మకాలపై కోరాపుట్ కలెక్టర్ విధించిన నిషేధపు ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. జనవరి 23న కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ రాసిన లేఖలో జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నాన్ వెజ్, మత్తు పదార్థాలు తినకుండా చూడాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు.
ప్రజా ఆగ్రహం..
కలెక్టర్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. జిల్లా స్థాయి యంత్రాంగం గణతంత్య్ర దినోత్సవ సన్నాహాక కమిటీ సూచన మేరకు ఈ ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు మరోసారి పరిశీలన తరువాత వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాన్ వెజ్ నియంత్రణపై జిల్లావ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం దీనికి కారణమని జాతీయ మీడియా వార్తలు ప్రచురించాయి.
‘‘ఏకపక్ష, రాజ్యాంగ విరుద్దమైన ఉత్తర్వూ ఇప్పుడు రద్దు చేశారు. రాజ్యాంగ స్వేచ్ఛలను ఇష్టానుసారంగా నిలిపివేయలేము. ముఖ్యంగా కోరాపుట్ వంటి వైవిధ్యమైన గిరిజన జిల్లాలో గణతంత్య్ర దినోత్సవం స్వేచ్ఛ గురించి. జై జోహార్, జై కోరాపుట్, జై హింద్’’ అని ఎంపీ సప్తగిరి ఉలక ఎక్స్ లో పోస్ట్ చేశారు.
రాయ్ పూర్ లో..
దేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా నాన్ వెజ్ బ్యాన్ పై ఉత్తర్వులు వచ్చాయి. గణతంత్య్ర దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి, జనవరి 30 న నాన్ వెజ్ తినకూడదని రాయ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజులలో మాంసం దుకాణాలు, కబేళాలు, సంబంధిత సంస్థలు మూసివేయాలని పౌర సంస్థలు ఆదేశించింది. వీటిని పర్యవేక్షించే బాధ్యత అధికారులపై ఉంది.
నాసిక్ లో కబేళాల మూసివేత..
మహారాష్ట్రలోని నాసిక్, మాలేగావ్ లలో కూడా వధశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆ రోజు జంతువధకు అనుమతి లేదని, ఎవరైన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే మున్సిపల్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయోధ్య, పంచకోసిలో కూడా ఇలాంటి నిబంధనలే ఉన్నాయి.
Next Story

