సామాన్య ప్రజలే నా వారసులు: మోదీ
x

సామాన్య ప్రజలే నా వారసులు: మోదీ

‘‘తమ సంతానాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం, ప్రోత్సహించడం గురించి నా ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ నా వారసులు సామాన్య ప్రజలేనని మోదీ చెప్పారు.


ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటోందన్న ప్రతిపక్ష ఆరోపణలను ప్రధాని మోదీ ఖండించారు. తమ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించదని స్పష్టం చేశారు.

బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాల నుంచి రికవరీ చేసిన డబ్బు దేశంలోని పేదలకు చెందినదని అన్నారు.

“ఈడీకి వ్యతిరేకంగా వారు (ప్రతిపక్షాలు) ఎందుకు గొంతు చించుకుంటున్నారో నేను మీకు చెప్తాను. గత కాంగ్రెస్ హయాంలో స్కూల్ బ్యాగ్‌లో ఉన్న రూ.35 లక్షలను మాత్రమే ఈడీ స్వాధీనం చేసుకుంది. మేము బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అదే ఏజెన్సీ రూ. 2,200 కోట్లను రికవరీ చేసింది. ఈ డబ్బును తీసుకెళ్లేందుకు 70 చిన్న ట్రక్కులను వినియోగించాల్సి వచ్చింది. ”అని ప్రధాని చెప్పారు.

‘‘తమ సంతానాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం, ప్రోత్సహించడం గురించి నా ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ నాకు వారసులు లేరు. సామాన్య ప్రజలే నా వారసులు”. అని మోదీ చెప్పారు.

కాంగ్రెస్, RJD ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని, తాను ఉన్నంత వరకు అలాంటి వాటిని సాగనివ్వనని హామీ ఇచ్చారు.

బీహార్‌లో RJD పాలనలో కిడ్నాప్, దోపిడీలు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరం గురించి అభ్యంతరకర ప్రకటనలు చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.

NDA సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఇప్పుడున్న కేంద్ర మంత్రులు 60 శాతం OBC/SC/ST వర్గాలకు చెందిన వారేనని నొక్కి చెప్పారు. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎన్డీయేకు ఓటు వేయాలని కోరారు.

తన ప్రసంగంలో మోడీ తన ప్రభుత్వ అభివృద్ధి ట్రాక్ రికార్డ్‌ను కూడా టచ్ చేశారు. హైవేల నిర్మాణం, సామాజిక న్యాయం, సాధికారతకు నిబద్ధతను నొక్కిచెప్పారు.

Read More
Next Story