
ఐబొమ్మ రవికి బెయిల్.. ఇంటర్నెట్ వాడొద్దని షరతు
సినిమా పైరసీ కేసులో ఇమ్మడి రవికి బెయిల్. పాస్‌పోర్ట్ సరెండర్, దేశం విడిచి వెళ్లరాదు, రోజూ సీసీఎస్ ముందు హాజరు ఆదేశం.
ఐబొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వేల సినిమాలను ఐబొమ్మ సైట్‌లో పైరసీ చేసిన కేసులో ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా ఉన్నతన్యాయస్థానం కండిషనల్ బెయిల్ మంజూరు చేయడం కీలకంగా మారింది. దేశం విడిచి వెళ్లకూడదని, నాలుగు వారాల్లో పాస్‌పోర్ట్‌ను కోర్టులో జమ చేయాలని ఆదేశించింది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది.
ఇమ్మడి రవి గతేడాది నవంబరులో అరెస్టయ్యాడు. నాంపల్లి కోర్టు కూడా షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఇంటర్నెట్ వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, అది కూడా పోలీసుల ముందస్తు అనుమతితో వాడాలని ఆదేశించింది. కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి చిత్ర పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం కలిగించారనే ఆరోపణలపై రవిని అరెస్టు చేశారు.
కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున మళ్లీ వెబ్‌సైట్ నిర్వహణ చేపట్టకుండా ఉండేందుకే కోర్టు అరుదైన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. విచారణలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రహ్లాద్ కుమార్, అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు వాడి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. ఈ వివరాలతో బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు తేలింది. అమీర్‌పేట హాస్టల్‌లో ఉంటూ ప్రహ్లాద్‌తో పరిచయం ఏర్పడింది.
2017లో ప్రహ్లాద్ పదో తరగతి మార్కుల లిస్ట్, ఆధార్ జిరాక్స్‌లు తీసుకుని వాటితో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు. వాటి ఆధారంగా బ్యాంక్ ఖాతా తెరిచాడు. అంజయ్య, తన క్లాస్‌మేట్ కాళీప్రసాద్ పేర్లతో కూడా గుర్తింపు కార్డులు రూపొందించాడు. ఈ పేర్లతో డొమైన్లు కొనుగోలు చేసి హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ వెబ్‌సైట్లు ఏర్పాటు చేశాడు. అవి సక్సెస్ కాలేదు. ఆ తరువాతే ‘ఐబొమ్మ’ ప్రారంభించాడు.
రవికి చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా రూ.13 కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అందులో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో ఖర్చు చేసి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అరెస్ట్ సమయంలో మీడియాతో మాట్లాడిన తండ్రి అప్పారావు కుమారుడు తప్పు చేశాడని అంగీకరించారు. పరిణామాలు చూస్తే నేరం చేసినట్లు ఒప్పుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. పోలీసులకు సవాల్ చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
కోట్లు సంపాదించడం సులభం కాదని అన్నారు. తాను సాధారణ జీవితం గడుపుతున్నానని తెలిపారు. కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడని, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు. చేసిన పని తప్పేనని స్పష్టం చేశారు. ఇప్పుడు బెయిల్‌పై బయటకు రానున్న రవి కుటుంబ సభ్యులతో ఉంటాడా, ఉద్యోగం చేపడతాడా అన్నది చర్చనీయాంశమైంది.
కోర్టు స్పష్టంగా ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించింది. స్వయంగా ఎలాంటి ఆన్‌లైన్ సేవలు వాడకూడదని, అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపింది. దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేస్తూ పాస్‌పోర్ట్‌ను వెంటనే జమ చేయాలని ఆదేశించింది. పైరసీ ఆరోపణల మధ్య అరెస్టైన రవికి ఇప్పుడు షరతులతో కూడిన స్వేచ్ఛ లభించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

