కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరాతో దాడిచేసిందెవరు?
ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై నియోజకవర్గంలోని కొందరు వ్యక్తులు శుక్రవారం సిరాతో దాడి చేశారు.
ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై నియోజకవర్గంలోని కొందరు వ్యక్తులు శుక్రవారం సిరాతో దాడి చేశారు. న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలోని ఆప్ కార్యాలయం వెలుపల ఈ ఘటన జరిగింది. స్థానిక కౌన్సిలర్ ఛాయా శర్మతో పార్టీ సమావేశం ముగిసిన తర్వాత కన్హయ్య బయటకు వస్తుండగా దాడి చేశారు.
"కొందరు వ్యక్తులు వచ్చి కన్హయ్య కుమార్‌కు పూలమాల వేశారు. తరువాత ఆయనపై సిరా విసిరి దాడికి యత్నించారు.’’ అని ఛాయా శర్మ పేర్కొన్నారు. ఛాయా శర్మ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా ఆమె పట్ల వారు దురుసుగా ప్రవర్తించి బెదిరించారు. నియోజకవర్గానికి చెందిన ప్రత్యర్థి పోటీదారు మనోజ్ తివారీ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు.
సిట్టింగ్ ఎంపీగా ఉన్న తివారీ తనకు పెరుగుతున్న ప్రజాదరణతో విసుగు చెందారని, అందుకే తనపై దాడికి "గూండాలను" పంపారని ఆయన అన్నారు. మే 25న జరిగే ఓటుతో హింసకు ప్రజలే సమాధానం చెబుతారని కన్హయ్య పేర్కొన్నారు. ఆరో దశ ఎన్నికలలో దేశ రాజధాని ఢిల్లీలో మే 25న పోలింగ్ జరగనుంది.
ఎవరీ కన్హయ్య కుమార్?
కన్హయ్య కుమార్ 13 జనవరి 1987లో బిహార్ రాష్ట్రం, బేగుసరాయ్‌లో జైశంకర్ సింగ్, మీనా దేవి దంపతులకు జన్మించారు. ఈయన ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి పూర్తి చేశాడు. కన్హయ్య కుమార్ సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్‌లో 2008లో చేరాడు. ఆయన 2015లో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి ఏఐఎస్‌ఎఫ్ తరపున జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2018 ఏప్రిల్‌లో సీపీఐ జాతీయ సమితిలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని బెగూసరయ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 28 సెప్టెంబర్ 2021న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ 06 జూలై 2023న నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) ఎఐసిసి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఆయన రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడిచాడు.
2016 ఫిబ్రవరి 9వ తేదీన జేఎన్‌యూ క్యాంపస్‌లో అప్జల్ గురుకు ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేసాడని కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది.
Next Story