ప్రచారానికి డబ్బుల్లేవని తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
x

ప్రచారానికి డబ్బుల్లేవని తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

ఎన్నికల ప్రచారానికి పార్టీ ఫండ్ ఇవ్వలేదు. తన దగ్గర ఉన్నదంతా ఖర్చుచేసింది. ప్రచారానికి సహకరించాలని పార్టీ సీనియర్ నాయకులను సంప్రదించినా లాభం లేకపోయింది.


పూరీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. పార్టీ టిక్కెట్‌ను తిరిగి ఇచ్చేశారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ ఫండ్ ఇవ్వకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. సొంత నిధులతో ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ ఒడిశా ఇన్‌చార్జి అజోయ్ కుమార్ చెప్పారు. అదే విషయాన్ని ఆమె ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు లేఖ ద్వారా తెలియజేశారు.

ప్రజల నుంచి విరాళాల కోసం..

జర్నలిస్టు నుంచి రాజకీయవేత్తగా మారిన సుచరిత మొహంతి క్రౌడ్ ఫండింగ్ కోసం ఒక వీడియో చేశారు. తన ఫోటో, క్యూఆర్ కోడ్‌ను జతచేసి ఉన్న ఆ వీడియోను ఏప్రిల్ 29న సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “పూరీలో మా ప్రచారాన్ని కాపాడండి ! విరాళం ఇవ్వండి! మనం చేయగలం,” అని ఎక్స్ లో పోస్టు చేశారు.


అయితే తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని, తన నాయకుడు రాహుల్ గాంధీ అని మొహంతి అన్నారు. ఆమెపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బిజెడి అభ్యర్థి, ముంబై మాజీ పోలీసు కమిషనర్ అరుప్ పట్నాయక్‌ పోటీ చేస్తున్నారు. పూరీ లోక్‌సభ స్థానానికి మే 25న పోలింగ్ జరగనుంది.

Read More
Next Story