
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. గాంధీ భవన్‌లో సంబరాలు!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. పలు మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకోగా గాంధీ భవన్‌లో వేడుకలు మొదలయ్యాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. విక్టరీ వన్‌సైడ్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు కూడా స్టార్ట్ చేసేశాయ్. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుండటంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. సీనియర్ నేత వీహెచ్, మెట్టు సాయి తదితరులు మిఠాయిలు పంచుకుంటూ విజయానందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ సొంత మండలమైన భీంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పూర్తికాగా ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం నందికొండలో కాంగ్రెస్ 12 వార్డులకు గాను 11 గెలిచి సునామీ సృష్టించింది. అలాగే నేరేడుచర్ల, మరిపెడ, సుల్తానాబాద్, డోర్నకల్, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. హాలియాలో కూడా హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ కూడా కొన్ని ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. గడ్డపోతారం, అయిజ, తొర్రూరు మున్సిపాలిటీలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ అనూహ్యంగా 8 స్థానాలను గెలుచుకోగా దేవరకద్ర, అలంపూరు మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ పరిస్థితి నెలకొంది. మొత్తం 2,582 వార్డులకు గాను ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 695 స్థానాలతో అగ్రస్థానంలో ఉండగా బీఆర్‌ఎస్ 376, బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల లెక్కింపు కొనసాగుతుండటంతో తుది ఫలితాల కోసం అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

