కార్మిక సంఘాల సమ్మెకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
x

పాత చిత్రం 

కార్మిక సంఘాల సమ్మెకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో బిజెపి తప్ప అన్ని జాతీయ పార్టీలు సమ్మెకు మద్దతు ఇచ్చినట్టు అయ్యింది


కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 న 10 కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు ఎఐసిసి (All India Congress Committee) మద్దతు తెలిపింది. కేంద్ర విధానాలు నాలుగు లేబర్ కోడ్ ల పేరుతో ఉద్యోగ భద్రతను లేకుండా చేసి కార్మికులకు చట్టపరంగా ఉన్న భధ్రతను నీరుగారుస్తోందని అవి ఆరోపిస్తున్నాయి.

ఈ మార్పుల మూలంగా యజమానులకు కార్మికులను తొలగించే వెసులుబాటు కలిగి వారి హక్కులు, ప్రయోజనాలకు భంగం కలుగుతుందని అవి నిరసన వ్యక్తం చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కె.సి. వేణుగోపాల్ పేరుతో ఒక లేఖను అన్ని రాష్ట్రాల పిసిసి ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులకు రాశారు.

కాంగ్రెస్ పార్టీ కూడా సమ్మెకు మద్దతు తెలియచేయడంతో అన్ని జాతీయ పార్టీలు సమ్మెకు మద్దతు తెలిపినట్టయ్యింది. అనేక రైతు సంఘాలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించటం విధానాల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తుందని ఈ ప్రకటన అభిప్రాయ పడింది.

పది కార్మిక సంఘాలు ఒక సంయుక్త ప్రకటనలో బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్నదని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చాయి. “మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం`2025, వీబీజి`రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో 100శాతం విదేశీ పెట్టుబుడులకు అనుమతించడం లాంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించాలని,” అవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి.

కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు లాభం చేకూర్చేలా ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్‌లను తెచ్చిందని వాటి వలన కార్మికులు ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ మరియు పెన్షన్ వంటి సామాజిక భద్రతకు దూరమవుతారని అవి ఆవేదన వ్యక్తం చేశాయి.

కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయి అని చెప్తూ, “ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కార్మికుల పనిగంటలు పెంచుతూ చట్ట సవరణ జరిగింది. వీబీజి`రామ్ జీ చట్టం తెచ్చి కేంద్రం తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నది. బడ్జెట్‌లో కేటాయింపులు పని రోజులు తగ్గిస్తోంది. విద్యుత్ సవరణ బిల్లు వల్ల సామాన్యులకు విద్యుత్ చార్జీలు పెరుగుతాయి. స్మార్ట్ మీటర్లు, క్రాస్ సబ్సిడీ రద్దుతో రైతులు, పేదలకిచ్చే ఉచిత మరియు సబ్సిడీ విద్యుత్ ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. ఇది ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం,” అని ఆ ప్రకటన తెలిపింది.

విత్తన సవరణ బిల్లు వల్ల విత్తనాల ధరలను నియంత్రించే అధికారం ప్రయివేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళి, బహుళజాతి కంపెనీల పట్టు పెరుగుతుంది. దీంతో సాగు ఖర్చు భారీగా పెరుగుతుంది. ఎల్ఐసీలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వల్ల విదేశీ కంపెనీలు కేవలం లాభాపేక్షతో పని చేస్తాయి. క్లెయిమ్ లు విషయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. ప్రజల సొమ్మును మన దేశ అభివృద్ధికి కాకుండా విదేశీ కంపెనీల లాభాలకు మళ్ళిస్తారు, అని విధానాల వలన జరిగే నష్టాలను వివరించింది.

మరో ప్రకటనలో సమ్మెకు మద్దతు ఇస్తున్న సీపీఐ కి చెందిన ఎమ్యెల్యే కూనమనేని సాంబశివ రావు రాష్ట్ర వ్యాపితంగా సమ్మెకు మద్దతుగా జరిగే సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలలో సిపిఐ శ్రేణులు పెద్దయెత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

సమ్మెలో భాగంగా యస్ కె యం ఆర్టీసీ కల్యాణ మండపం నుండి ఇందిరా పార్క్ వరకు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. “విద్యుత్ బిల్లు 2025 రైతులకు , జిల్లా గృహ వినియోగదారులకు విద్యుత్ రేట్లను పెంచుతుంది , పీక్ అవర్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లను విధిస్తుంది. బిజెపి ఎన్నికల ప్రచారాలలో కూడా హామీ ఇచ్చినట్లుగా స్మార్ట్ మీటర్లను అందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని SKM డిమాండ్ చేస్తోంది. గ్రామసభలు నిర్ణయించిన విధంగా గ్రామీణ ప్రజలకు పని హామీ ఇచ్చే నరేగా (MNREGA) ను రద్దు చేస్తూ వీబీ-జీ రాం జీ (VB GRAMG) చట్టాన్ని అమలును యస్ కె యం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బహుళజాతి విత్తనాలను ఉచితంగా దిగుమతి చేసుకోవడం, విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి అనుమతించే కొత్త విత్తన బిల్లును,” యస్ కె యం ప్రకటన వ్యతిరేకించింది.

పారిశ్రామిక కార్మికులకు సంఘీభావంగా, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కాపీలను దహనం చేస్తూ నిరసన ప్రదర్శనలో సామూహికంగా పాల్గొనాలని యస్ కె యం రైతులందరికీ విజ్ఞప్తి చేసింది.

బీజేపీ కి చెందిన భారతీయ మజ్దూర్ సంఘ మాత్రం ఈ సమ్మెను వ్యతిరేకించింది.

Read More
Next Story